Sat Nov 23 2024 01:30:24 GMT+0000 (Coordinated Universal Time)
పేట్రేగిన ఉగ్రవాదులు.. 32 మంది సజీవదహనం
మాలి దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండియాగా సమీపంలో రహదారిపై వెళ్తున్న బస్సును అడ్డుకుని మెరుపుదాడులు చేశారు
మాలి దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండియాగా సమీపంలో రహదారిపై వెళ్తున్న బస్సును అడ్డుకుని మెరుపుదాడులు చేశారు ఉగ్రవాదులు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు.. బండియాగ్రాలోని ఓ మార్కెట్కు సోంగో విలేజ్కు చెందిన ప్రజలు వెళ్తున్నారు. వారానికి రెండ్రోజులు మాత్రమే అక్కడికి వెళ్లే బస్సులో శుక్రవారం సోంగోతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మహిళలు మార్కెట్లో పనిచేసేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆ బస్సునే టార్గెట్ గా చేసుకున్నారు. వెళ్తున్న బస్సును ఆపి.. డ్రైవర్ ను హతమార్చారు. ఆ తర్వాత బస్సు టైర్లలో గాలి తీసేశారు.
విచక్షణారహితంగా కాల్పులు...
భయంతో బిక్కు బిక్కుమంటూ బస్సులో కూర్చున్న అమాయక ప్రయాణికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం పెట్రోల్ పోసి బస్సుకు నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఉగ్రదాడిలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాల్లో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి భయంకరమైన వాతావరణం కనిపిస్తోంది. మాలిలో ఉగ్రవాదం పెరిగిపోతోంది. ముఖ్యంగా నార్త్ మాలిలో ఉగ్రదాడులు రెట్టింపవుతున్నాయి. ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాట్లతో అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తాజాగా జరిగిన ఈ ఉగ్రదాడిపై అక్కడి ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
Next Story