Mon Dec 23 2024 15:26:44 GMT+0000 (Coordinated Universal Time)
తొలి ఒమిక్రాన్ మరణం నమోదు.. ఫ్రాన్స్ లో సిక్త్ వేవ్
యూకే లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. పేరుకి ఇది సౌతాఫ్రికాలో పుట్టినా.. బ్రిటన్ లో మాత్రం శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 66 దేశాలకు పైగా ఒమిక్రాన్ వ్యాపించిందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే.. ఇప్పటి వరకూ ఒమిక్రాన్ సోకిన వారిలో ఎవరూ చనిపోకపోవడంతో.. దీనివల్ల ప్రాణానికి పెద్దగా ముప్పు ఉండదని సంబరపడ్డారు. కానీ.. ఊహించని షాకిచ్చింది ఒమిక్రాన్. తాజాగా యూకే లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు ఉదయమే ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మరణించినట్లు తెలిపింది. కాగా.. నిన్న ఒక్కరోజే యూకేలో 600లకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
మూడు వేలకు పైగానే....
ఇప్పటి వరకూ బ్రిటన్ లో సుమారు 3 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఒమిక్రాన్ కేసుల నమోదు ఇలాగే కొనసాగితే.. మళ్లీ ఆస్పత్రులపై, సిబ్బందిపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అటు ఫ్రాన్స్ లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం.. అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. జనవరిలో ఫ్రాన్స్ లో సిక్త్ వేవ్ ప్రారంభమవ్వచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. ఒమిక్రాన్ ను కట్టడి చేయడం కష్టమంటున్నారు. కేసులు మరింత తీవ్రంగా ఉంటాయని, ఇప్పటి నుంచి జాగ్రత్తలు వహించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శీతాకాలం ముగిసే సరికి.. అంటే ఏప్రిల్ నాటికి ఒక్క బ్రిటన్ లోనే కరోనా మరణాల సంఖ్య 75 వేలకు పెరిగే ప్రమాదం లేకపోలేదంటున్నారు. యూరప్ మొత్తం మీద ఈ మరణాల సంఖ్య 7 లక్షలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Next Story