Sun Dec 22 2024 13:45:52 GMT+0000 (Coordinated Universal Time)
ఇమ్రాన్ కు గడ్డురోజులు.. అవిశ్వాసం నుంచి బయటపడతారా?
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇమ్రాన్ వల్లనే పాకిస్థాన్ కు గడ్డు రోజులు వచ్చాయని విపక్షాలు అభిప్రాయపడ్డాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొటున్నారు. పాకిస్థాన్ లో విపరీతంగా ధరలు పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడంతో దీనికి ప్రధాన కారణం ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాలేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అల్టిమేటం ఇచ్చి....
అంతకు ముందే ఇమ్రాన్ ఖాన్ కు విపక్షాలు అల్టిమేటం ఇచ్చాయి. ఐదు రోజులలో రాజీనామా చేయకపోతే అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించాయి. చెప్పినట్లుగానే ఈరోజు ఆయనపై అవిశ్వాసం పెట్టారు. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇందుకు ఇమ్రాన్ ఖాన్ బాధ్యత వహించాలని విపక్షాలు ఆరోపించాయి. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.
బలం తక్కువగానే....
పాకిస్థాన్ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం 177 స్థానాలు. అయితే ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయనకు మద్దతిచ్చే పార్టీలతో కలిపి 156 స్థానాలున్నాయి.. తక్కువ స్థానాలున్నా సైన్యం మద్దతుతో నెట్టుకొస్తున్నారు. విపక్షాలన్నీ ఏకమైతే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయంగా కన్పిస్తుంది. పాక్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. దీంతో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం నుంచి ఎలా బయటపడతారన్నది చూడాల్సి ఉంది.
Next Story