Sat Dec 21 2024 05:54:38 GMT+0000 (Coordinated Universal Time)
అవి వేసుకోకుండా ఉంటే మహిళలు జంతువుల్లా కనిపిస్తారు
రాజధాని కాబూల్‌లోని మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఈ పోస్టర్స్ ను ధృవీకరించారు.
తమ శరీరాలను పూర్తిగా కప్పి ఉంచేలా హిజాబ్ ధరించని ముస్లిం మహిళలు జంతువుల లాగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారని తాలిబాన్ మత పెద్దలు చెబుతూ ఉన్నారు. దక్షిణ ఆఫ్ఘన్ నగరం కాందహార్ అంతటా ఇలాంటి పోస్టర్లు అతికించారు. ఆగస్ట్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి, తాలిబాన్ ఆఫ్ఘన్ మహిళలపై కఠినమైన ఆంక్షలు విధించింది. మేలో, దేశ అత్యున్నత నాయకుడు, తాలిబాన్ చీఫ్ హిబతుల్లా అఖుంద్జాదా మహిళలు సాధారణంగా ఇంట్లోనే ఉండాలనే డిక్రీని ఆమోదించారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లాలంటే ముఖాలతో సహా పూర్తిగా కప్పుకోవాలని ఆదేశించారు.
మినిస్ట్రీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ వర్చ్యు అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ అనే ఇస్లామిక్ సంస్థ మహిళలు హిజాబ్ ను తప్పకుండా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. కాందహార్ నగరం అంతటా బుర్ఖాలు తప్పకుండా వేసుకోవాల్సిందే అనే విధంగా పోస్టర్స్ ను ఉంచారు. స్త్రీ శరీరాన్ని తల నుండి కాలి వరకు కప్పి ఉంచేలా చూసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. "హిజాబ్ ధరించని ముస్లిం మహిళలు జంతువుల్లా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు" అని పోస్టర్లలో రాసి ఉంది. చాలా కేఫ్‌లు, దుకాణాలపై హోర్డింగ్స్ రూపంలో ఉంచారు. పొట్టిగా, బిగుతుగా, పారదర్శకంగా ఉండే దుస్తులు ధరించడం కూడా అఖుంద్జాదా డిక్రీకి విరుద్ధమని పోస్టర్లు చెబుతున్నాయి.
రాజధాని కాబూల్‌లోని మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఈ పోస్టర్స్ ను ధృవీకరించారు. అఖుంద్జాదా డిక్రీని పట్టించుకోని అధికారులను ప్రభుత్వ ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి హక్కుల చీఫ్ మిచెల్ బాచెలెట్ ఈ నిబంధనలపై ఇస్లామిస్ట్ ప్రభుత్వాన్ని నిందించారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 1996 నుండి 2001 వరకు అమలు చేయబడిన మునుపటి కఠినమైన పాలనా వ్యవస్థకు దూరంగా ఉంటామని తాలిబాన్ వాగ్దానం చేసింది. అయితే ఆగస్టు నుంచి మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. బాలికలకు పాఠశాలలు మూసివేశారు. మహిళలను ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండకుండా నిరోధించారు.
Next Story