బొగ్గు గనిలో ప్రమాదం.. 25 మందికి పైగా మృతి
టర్కీలో మైన్ బ్లాస్ట్ తీవ్ర విషాదానికి కారణమైంది. ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ కారణంగా పేలుడు సంభవించదాంతో 25 మంది మరణించారు. డజన్ల కొద్దీ కూలీలు వందల మీటర్ల భూగర్భంలో చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా గత 11 సంవత్సరాల్లో టర్కీ లో అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఇది ఒకటని అన్నారు. బొగ్గు మైనింగ్ చేసే పట్టణం అమాస్రాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఘటన చోటు చేసుకున్న సమయంలో 110 మంది పనిచేస్తున్నారు. వారిలో కొందరు తమంతట తానుగా బయటకు వచ్చారు, మరికొందరిని అధికారులు రక్షించారు. దాదాపు 50 మంది మైనర్లు భూమికి దిగువన 300, 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) మధ్య రెండు వేర్వేరు ప్రాంతాలలో చిక్కుకున్నారని ధృవీకరించారు. పిట్ ప్రవేశద్వారం దెబ్బతినడంతో రెస్క్యూ పనులు ఆలస్యం అయ్యాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసి శనివారం ప్రమాద స్థలానికి చేరుకోనున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో చాలా మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయని అమాస్రా మేయర్ రెకాయ్ కాకిర్ తెలిపారు. సూర్యాస్తమయానికి కొద్ది క్షణాల ముందు పేలుడు సంభవించింది. చీకటి కారణంగా రెస్క్యూ ప్రయత్నానికి ఆటంకం ఏర్పడింది. టర్కీకి చెందిన మాడెన్ ఈజ్ మైనింగ్ వర్కర్స్ యూనియన్ పేలుడుకు మీథేన్ గ్యాస్ ఏర్పడటమే కారణమని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఖచ్చితమైన నిర్ధారణకు ఇంకా రాలేదు.