Wed Nov 06 2024 00:40:28 GMT+0000 (Coordinated Universal Time)
కాళికామాత చిత్రం వక్రీకరణ.. క్షమాపణలు కోరిన ఉక్రెయిన్
కాళీమాత అమ్మవారి నడుము పై భాగం మేఘాలపై.. మేఘం కింద కాళ్లు కనిపించేలా.. మధ్యలో మేఘం గౌను మాదిరిగా రూపొందించి..
ఇటీవల ఉక్రెయిన్ రక్షణశాఖ చేసిన ఓ పనికి భారత్ లో తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కష్టకాలంలో భారత్ నుండి సహాయం పొందిన ఉక్రెయిన్.. భారతీయులు ఎంతో భక్తితో పూజించే కాళికామాత చిత్రాన్ని వక్రీకరిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ శాఖ చేసిన ట్వీట్ పై పెద్దఎత్తున దుమారం రేగింది. భారత్ లో హిందువుల ఆరాధ్యదైవమైన కాళికామాతను అలా చిత్రీకరించడంపై ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. తమ మతాన్ని పూజించాలి.. పరమతాన్ని గౌరవించాలన్న ఆలోచన లేకుండా చేసిన పనికి హిందువుల కోపం కట్టలు తెంచుకుంది.
కాళీమాత అమ్మవారి నడుము పై భాగం మేఘాలపై.. మేఘం కింద కాళ్లు కనిపించేలా.. మధ్యలో మేఘం గౌను మాదిరిగా రూపొందించి ఉక్రెయిన్ రక్షణశాఖ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను ఇప్పుడు డిలీట్ చేశారు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎమినే జపరోవా భారత్ లో ఇటీవలే పర్యటించగా.. ఆ తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ట్వీట్ పై స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ సీనియర్ అడ్వైజర్ కాంచన్ గుప్తా.. సదరు చిత్రం హిందువుల మనోభావాలను గాయపరచడమేనని పేర్కొన్నారు.
ఈ ట్వీట్ దుమారంపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎమినే జపరోవా స్పందించారు. ‘‘రక్షణ శాఖ హిందూ దేవత అయిన కాళీని వక్రకీరించినందుకు విచారిస్తున్నాం. ఉక్రెయిన్, ఉక్రెయిన్ ప్రజలు వినూత్నమైన భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. భారత మద్దతుకు అభినందనలు. వక్రీకరించిన చిత్రం ఇప్పటికే డిలీట్ చేశాం.’’ అని ట్వీట్ చేశారు.
Next Story