Tue Dec 24 2024 12:23:50 GMT+0000 (Coordinated Universal Time)
చిగురుటాకులా వణికిపోతున్న అగ్రరాజ్యం.. 60కి పెరిగిన మృతులు
రోడ్లన్నీ కార్లు, బస్సులు, అంబులెన్సులు, ట్రక్కులతో నిండిపోయి.. మంచులో కూరుకుపోయాయి. ఒంటరిగా ఉన్నవారికి..
మంచు తుపాను దెబ్బకు.. అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో.. కొద్దిరోజులుగా అక్కడ మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నార్త్ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ కోతలుండటంతో.. హీటర్లు సైతం పనిచేయక చలికి వణుకుతూ.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ భీకర తుపానును ఈ శతాబ్దపు మంచు తుపానుగా చెబుతున్నారు అధికారులు. తుపాను కారణంలో న్యూయార్క్ రాష్ట్రంలోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి వరకూ 31గా ఉన్న మృతుల సంఖ్య.. ఈరోజు 60కి పెరిగింది.
పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలోలో సిబ్బంది మంచును తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ మంచులో కూరుకుపోయిన వాహనాల్లో మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా వాహనాల్లో ఉండిపోయారా అని ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇక వాహనాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్లన్నీ కార్లు, బస్సులు, అంబులెన్సులు, ట్రక్కులతో నిండిపోయి.. మంచులో కూరుకుపోయాయి. ఒంటరిగా ఉన్నవారికి అత్యవరస వైద్యం చేయడం కష్టతరమవుతోందని వైద్యులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు హై లిఫ్ట్ ట్రాక్టర్లను మోహరించారు. మంగళవారం వరకు పశ్చిమ న్యూయార్క్లో 23 సెంటీమీటర్లకు పైగా మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంచు తుపాను కారణంగా అమెరికాలో 15 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దవ్వడంతో.. ప్రయాణికులు ఎయిర్ పోర్టులలో పడిగాపులు పడుతున్నారు.
Next Story