Tue Nov 05 2024 05:31:46 GMT+0000 (Coordinated Universal Time)
Bangladesh : కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు... ఇప్పటికే 103 మంది మృతి
బంగ్లాదేశ్ లో హింస కొనసాగుతుంది. ఈ హింసలో దాదాపు నూట మూడు మంది మరణించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి
బంగ్లాదేశ్ లో హింస కొనసాగుతుంది. ఈ హింసలో దాదాపు నూట మూడు మంది మరణించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల సంస్కరణ ల కోసం ఆందోళనలు పెద్దయెత్తున చెలరేగుతున్నాయి. వీటిని అదుపు చేయడం భద్రతాదళాలకు కూడా కష్టంగా మారింది. సైన్యం వల్ల కూడా కావడం లేదు. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. అయినా ఆందోళలనలు ఆగడం లేదు. కానీ దేశంలో ఎక్కడో ఒకచోట అల్లర్లు జరిగి హింస చెలరేగి అనేక మంది మృత్యువాత పడుతున్నారు.
పరారయిన ఖైదీలు...
ఢాకా వైద్య కళాశాల వద్దనే 23 మృతదేహాలను కనుగొన్నట్లు మీడియా సంస్థలు వెల్లడించడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత మంగళవారం నుంచి ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం జరుగుతున్న ఆందోళనల్లో 103 మంది వరకూ మరణించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఆందోళనకారులు నార్సింగిడి జైలుకు నిప్పు పెట్టారు. దీంతో జైలులో ఉన్న 800 మంది ఖైదీలు పారిపోయినట్లు చెబుతున్నారు. ఘర్షణలు ఎంతకూ తగ్గకపోవడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి.
భారతీయ విద్యార్థులు...
అయినా సరే ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆమె స్పెయిన్, బ్రెజిల్ లో పర్యటించాల్సి ఉన్నా రద్దు చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల కారణంగా అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భారత్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే వెయ్యి మంది విద్యార్థులు భారత్ కు వచ్చినట్లు తెలిసింది. మరికొందరు నేడు కూడా బయలుదేరి భారత్ రావడానికి సిద్ధమవుతున్నారు.
Next Story