Mon Dec 23 2024 07:59:54 GMT+0000 (Coordinated Universal Time)
యుద్ధం మొదలు.. ఏమవుతుందో?
ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య యుద్ధం మొదలయింది. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు.
యుద్ధం రావడానికి అనేక కారణాలు. కానీ యుద్ధం కారణంగా నలిగిపోయేది.. మరణించేది సామాన్యులే. కానీ రెండు దేశాల మధ్య పగ, ప్రతీకారం చివరకు యుద్ధానికి దారితీస్తుంది. తమ చెప్పు చేతల్లో ఉండటం లేదని బలమైన దేశం బలహీన దేశాన్ని కబళించాలని చూస్తుంది. అదే సమయంలో కొన్ని కీలకమైన సంఘటనలు కూడా యుద్ధానికి దారి తీస్తాయి. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతుండగానే మరో యుద్ధానికి తెరలేచింది. ఇజ్రాయిల్ - పాలస్తీనాల మధ్య యుద్ధం మొదలయింది. నిన్న మొదలయిన యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ప్రాణ నష్టం అధికంగానే ఉంది. ఆస్తినష్టం గురించి ఇక వేరే చెప్పనవసరం లేదు.
మెరుపు దాడులతో...
ఇజ్రాయిల్ ఊహించలేదు. తామే నెంబర్ వన్ గా భావించిన ఇజ్రాయిల్ ను పాలస్తీనా చావుదెబ్బ తీసింది. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేయడంతో ఇజ్రాయిల్ చేష్టలుడిగి చూసిపోవాల్సింది. తేరుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం ఇరవై నిమిషాల్లోనే ఐదు వేల రాకెట్లను ప్రయోగించి హమాస్ మిలిటెంట్లు దాడికి దిగారు. 482 మంది చనిపోయారు. పదిహేను వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. గాజా నుంచి ప్రారంభమైన ఈ దాడులు ఇంకా ఉధృతమయ్యాయి. ఇజ్రాయిల్ భూభాగంలోకి కూడా మిలిటెంట్లు చొచ్చుకొచ్చారు. ఆకస్మిక దాడులతో ఇజ్రాయిల్ సేనలు వారికి తలవంచక తప్పలేదు. వారి చేతిలో కొందరు బందీలుగా చిక్కుకున్నారు.
ఎదురు దాడికి...
ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని ఇజ్రాయిల్ ప్రభుత్వం సూచించింది. గాజా బోర్డన్ నుంచి ఇజ్రాయిల్లోకి చొరబడిన పాలస్తీనా కు చెందిన హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. గాజా సిటీలో ఇజ్రాయిల్కు చెందిన అనేక మిలటరీ వాహనాలను పాలస్తీనా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తమపై దూసుకు వస్తున్న మిలిటెంట్లపై దాడులకు పూనుకుంది. ఇజ్రాయిల్ కూడా యుద్ధానికి సిద్ధం కావడంతో కాల్పులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. పాలస్తానీయులు కూడా ఎక్కువగానే చనిపోయారు. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి.
ఆ రెండు ప్రాంతాలను...
దాదాపు ఐదున్నర దశాబ్దాల క్రితం స్వాధీనం చేసుకున్న తమ భూప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకే ఈ యుద్ధం మొదలయింది. 1967లో అరబ్- ఇజ్రాయిల్ మధ్య జరిగిన యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది. ఈ రెండు తమకు కావాలంటూ పాలస్తీనా ఎప్పటి నుంచో భావిస్తుంది. రెండు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు పండగ చేసుకున్నారు. కేరింతలు కొట్టారు. ఇజ్రాయిల్ కూడా ఇక తగ్గేది లేదంటుంది. వారి పరమైన భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకునేంత వరకూ యుద్ధం తప్పదన్న హెచ్చరికలు పంపింది. మరి ఈ యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story