Thu Dec 05 2024 09:38:18 GMT+0000 (Coordinated Universal Time)
కిండర్ జాయ్ చాక్లెట్లను తిని అస్వస్థతకు గురైన చిన్నారులు
యూఎస్ ఆహార భద్రతా న్యాయ సంస్థ ప్రకారం 2021 డిసెంబర్ లో చాక్లెట్ తయారీ పదార్థాలలో సాల్మొనెల్లా(Salmonella) టైఫి మ్యురియమ్ అనే బ్యాక్టీరియా
బెల్జియం : కిండర్ జాయ్.. పిల్లలకు ఎంతో ఇష్టమైన తినుబండారం. చాకొలేట్ తో నిండిన ఈ ఎగ్ షేప్ వస్తువు అంటే పిల్లలు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అందులో ఇక ఆట వస్తువు కూడా ఉండడంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎక్కువగా వాటిని కొనిస్తూ ఉంటారు. తాజాగా కిండర్ జాయ్ చాక్లెట్లను తిని చిన్నారులు అస్వస్థతకు గురయ్యారనే వార్త తల్లిదండ్రులను కలవరపెడుతోంది. అయితే ఈ ఘటన మన దేశంలో చోటు చేసుకున్నది కాదు. బెల్జియంలోని అర్లోన్ నగరంలో..! అక్కడ ఫెర్రెరో కార్పొరేట్ ప్లాంట్లో తయారైన కిండర్ జాయ్ చాక్లెట్లను తిని 151 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అతిసారం, వాంతులతో ఇబ్బందులు పడడాన్ని గమనించిన చిన్నారుల తల్లిదండ్రులు వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
యూఎస్ ఆహార భద్రతా న్యాయ సంస్థ ప్రకారం 2021 డిసెంబర్ లో చాక్లెట్ తయారీ పదార్థాలలో సాల్మొనెల్లా(Salmonella) టైఫి మ్యురియమ్ అనే బ్యాక్టీరియాను ఉన్నట్లు గుర్తించారు. అలాంటి పదార్థాలతో తయారైన కిండర్ చాక్లెట్లను తినడం వల్ల అస్వస్థత కలిగిందని తెలుస్తోంది. సాల్మొనెల్లా జాతి బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైంది. ఇది ఆరు రకాల యాంటీబయాటిక్లకు నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ చాక్లెట్లను తిన్న తర్వాత తొమ్మిది మంది చిన్నారులు తీవ్రమైన సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రి పాలయ్యారు. ఇంకొంత మంది ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంది. ఇక అధికారులు ఆర్లోన్లోని చాక్లెట్ తయారీ సంస్థను మూసివేశారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ప్లాంట్ నిర్వహకులను ఆదేశించారు.
బెల్జియం-ఆధారిత కిండర్ బ్రాండ్ చాక్లెట్ను తిన్న తర్వాత అనేక దేశాలు సాల్మొనెలోసిస్ అనుమానాస్పద కేసులను నివేదించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ బ్రాండ్ తన చాకోలేట్లను రీకాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. బెల్జియం (26), ఫ్రాన్స్ (25), జర్మనీ (10), ఐర్లాండ్ (15), లక్సెంబర్గ్ (1), నెదర్లాండ్స్ (2), నార్వే (1), స్పెయిన్ (1), స్వీడన్ (4), యునైటెడ్ కింగ్డమ్ (65) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (1) లో కేసులు బయటపడ్డాయి. WHO బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. తొమ్మిది మంది చిన్నారులు ఇంకా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు.
Next Story