Mon Nov 18 2024 09:24:01 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : అందుకే ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు బ్రదర్.. ఢిల్లీకి అదిరేటి విజయం
రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు విజయం సాధించింది
ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఎన్నో వింతలు విశేషాలు. తక్కువ చేసి జట్టును చూస్తే అది పొరపడినట్లే. తమ విజయానికి ఢోకా లేదనుకున్న జట్లు కూడా విజయం ముంగిట బోల్తా పడుతున్నాయి. ఆషామాషీగా తీసుకోవడానికి ఏ జట్టు ఇందుకు అతీతం కాదు. ప్రతి జట్టులోనూ ఎవరో ఒకరు విజృంభించి ఆడతారు. అలాగే బౌలర్లు చెలరేగిపోతారు. అంతే చేతికి వస్తుందని భావించిన మ్యాచ్ చేజారిపోతుంది. ఐపీఎల్ లో ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడిన తీరును కూడా అదే తరహాలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే విజయం ముందుకు వచ్చి రాజస్థాన్ రాయల్స్ బోల్తా పడింది. ఢిల్లీ కాపిటల్స్ విజయకేతనం ఎగురవేసింది.
భారీ పరుగులు చేసి...
ఐపీఎల్ లో ఈసారి అనేక మంది ఆటగాళ్లు తమ బ్యాట్ కు పనిచెబుతున్నారు. కొత్త కుర్రోళ్లు చెలరేగిపోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఆదిలోనే ఆరంభం అదిరేలా ఆడింది. మెక్ గుర్క్ హాఫ్ సెంచరీ చేశాడు. పోరెల్ దూకుడుతో ఆడి 65 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లు అవుట్ అవుతున్నా స్టబ్స్ 41, నైబ్ 18 పరుగులు చేశారు. ఇరవై ఓవర్లకు ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. అంటే ఢిల్లీ ఈ మాత్రం పరుగులు చేస్తుందని కూడా రాజస్థాన్ రాయల్స్ ఊహించలేదు. అయినా సరే తాము ఆ స్కోరును అధిగమించడం పెద్ద కష్టం కాదని భావించింది.
వివాదాస్పద అవుట్ కావడంతో...
222 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు లో యశస్వి నాలుగు పరుగులకే అవుటయ్యాడు. బట్లర్ 19 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే నిలబడి విజయం కోసం పరితపించాడు. కానీ వివాదాస్పద అవుట్ అయి వెనుదిరిగాడు. సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ తాకుతూ పట్టారని చెబుతున్న అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో 86 పరుగుల వద్ద మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అదే సంజూ శాంసన్ కొంచెం సేపు ఉంటే రాజస్థాన్ రాయల్స్ గెలిచేదే. కానీ అనూహ్యంగా శ్యాంసన్ అవుట్ కావడంతో ఢిల్లీ పంట పండింది. ఆ తర్వాత వరసగా వికెట్లు పడిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఢిల్లీ కాపిటల్స్ పై ఓటమి పాలయింది.
Next Story