Fri Dec 20 2024 01:28:58 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఇది కదా మ్యాచ్ అంటే.. ఎవరైతేనేం.. ఓడిపోతేనేం.. కొట్టుడు అంటే ఇదే
కోల్కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ మధ్య పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది
ఐపీఎల్ అంటేనే అంతే. అలాంటి మజా మరేదీ ఉండదు. అసలు గెలుస్తుందా? అనుకున్న మ్యాచ్ ను గెలవడమే ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ లో జరుగుతున్న అంశాలే. గెలుపుకు ఏ మాత్రం ఛాన్స్ లేదని భావించి టిక్కెట్ కొన్నాం కదా? అని స్టేడియంలో కూర్చున్న అభిమానులకు ప్రతి మ్యాచ్ మంచి ఫీస్ట్ అందిస్తుంది. అందుకే ఐపీఎల్ కు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. ప్రతి సీజన్ కు ఐపీఎల్ ను అభిమానించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఎవరు గెలుస్తారని కాదు.. ఎవరు బాగా ఆడారన్నదే ఇక్కడే చూస్తారు. అనేక మంది పది జట్లకు అభిమానులున్నప్పటికీ గెలిచిన జట్టును, జట్టును గెలిపించిన ఆటగాడిని మెచ్చుకోకుండా ఏ ఒక్కరూ ఉండలేరు. దేశాల మధ్య జరిగే మ్యాచ్ లు కాకపోవడంతో ప్రతి జట్టులోనూ అన్ని దేశాలు వారు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి.
ఇంతటి స్కోరును....
నిన్న కోల్కత్తాలో జరిగిన మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఏకపక్షంగా సాగుతుందని అనుకున్నారు. అందులో కోల్కత్తా నైట్ రైడర్స్ సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుంది. దీంతో పాటు కేకేఆర్ మంచి ఊపు మీద ఉంది. అదే పంజాబ్ కింగ్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన ఇస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు భాగాన ఉంది. అందుకే పంజాబ్ కింగ్స్ గెలుపుపై పెద్దగా అంచనాలు ఎవరికీ లేవు. కోల్కత్తాలో జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ మధ్య పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అదీ ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే. తొలుత కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేసింది. నరేన్ ఎప్పటిలాగానే విజృంభించి ఆడాడు. నరేన్ కు సాల్ట్ తోడయ్యాడు. దీంతో వారిద్దరూ అవుటయినప్పటికీ కోల్కత్తా నైట్ రైడర్స్ ఇరవై ఓవర్లకు గాను 261 పరుగులు చేసింది.
ఊచకోత కోయడం...
ఇంత భారీ లక్ష్యం పంజాబ్ కు సాధ్యం కాదని అందరి మదిలో ఉన్నదే. కాకపోతే.. మ్యాచ్ కదా? చూడాలని చూడటమే అన్న తరహాలో చూస్తున్నారు. అంతే ఆశ్చర్యం.. బెయిర్ స్టో కేవలం 48 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, తొమ్మిది సిక్స్ లు ఉన్నాయంటే ఎంతటి ఊచకోత కోశాడన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. శశాంక్ సింగ్ 68 పరుగులు చేసి అగ్నికి ఆజ్యం తోడయినట్లు రన్ రేటును భారీగా పెంచడంలో సహకరించాడు. ప్రభ్ సిమ్రాన్ కూడా కేవలం ఇరవై బంతుల్లో 54 పరుగులు చేసి తన ఊపును కంటిన్యూ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ కేవలం 18.4 ఓవర్లలోనే 262 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. సెంచరీ సాధించిన బెయిర్ స్టో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. దీంతో ఆశ్చర్యకరంగా గెలిచి పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ కొన్ని పాయింట్లు సంపాదించి ఎగబాకింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
Next Story