Tue Dec 24 2024 12:26:18 GMT+0000 (Coordinated Universal Time)
Hardik Pandya : పూజలు చేస్తే పరుగులు వస్తాయా? వికెట్లు పడతాయా పాండ్యా
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా సోమనాధ్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా సోమనాధ్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పాండ్యా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్ కు హార్ధిక్ పాండ్యా మారారు. అప్పటి వరకూ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తొలగించి హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ గా చేశారు. 2022 సీజన్ లో హార్ధిక్ కెప్టెన్సీగా వ్యవహరించిన గుజరాత్ టైటాన్స్ కప్ ను గెలుచుకుంది.
కెప్టెన్సీ పగ్గాలు....
కానీ పాండ్యా ముంబయి ఇండియన్స్ కు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్క విజయం కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకూ ఈ సీజన్ లో మూడు మ్యాచ్ లు ఆడితే మూడింటిలోనూ ముంబయి ఇండియన్స్ ఓటమి పాలయింది. దారుణంగా ఓటమి చవి చూసింది. ఎలా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ముంబయి ఇండియన్స్ పై రికార్డు పరుగులు చేసి పాండ్యా టీం ను రేసులో లేకుండానే చేసింది. ముంబయి ఇండియన్స్ జట్టు బలమైన జట్టు ఇప్పటి వరకూ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న చరిత్ర దానిది.
రేపటి మ్యాచ్ లో...
కానీ ఈ సీజన్ లో మాత్రం ప్రారంభం నుంచి దానికి కలసి రావడం లేదు. రేపు ముంబయి వేదికగా ఢిల్లీ కాపిటల్స్తో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్కు ముందు పాండ్యా పూజలు చేయడంతో నెటిజన్లు అనేక కామెంట్లు పెడుతున్నారు. పూజలు చేసినంత మాత్రాన గెలుస్తారా? అంటూ సెటైర్లు విసిరుతున్నారు. జట్టు మొత్తం కొంత సేద తీరడానికి గుజరాత్ వెళ్లింది. అయితే అక్కడ హార్థిక్ పాండ్యా మాత్రం సోమనాధ ఆలయంలో పూజలు చేయడం మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పాండ్యా భయ్యా.. పూజలు కాదు.. జట్టు సభ్యుల్లో మైదానంలో పూనకాలు రావాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెటైర్లు కురిపిస్తున్నారు. మరి రేపటి మ్యాచ్ నైనా ముంబయి ఇండియన్స్ గెలిస్తే మాత్రం పాండ్యా పూజలు ఫలించినట్లేనన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.
Next Story