Mon Dec 23 2024 08:51:14 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : బెంగలూరు బౌన్స్ బ్యాక్ అయిందిగా... ఇక ఫ్యాన్స్ కు పండగే పండగ
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టు పుంజుకున్నట్లే కనిపిస్తుంది.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టు పుంజుకున్నట్లే కనిపిస్తుంది. ఐపీఎల్ అతి చెత్త ప్రదర్శన చేసిన జట్టుగా బెంగలూరు జట్టు పేరు తెచ్చుకుంది. అన్నీ ఓటములే. తొలినాళ్లలో ఒక మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత అసలు గెలుపులే లేవు. అన్నీ ఓటములే. దీంతో ఈ జట్టుపై ఫ్యాన్స్ కూడా మండి పడుతున్నారు. విరాట్ కోహ్లి మినహా అందరూ బ్యాటర్లు విఫలమవుతున్నారు. బౌలర్లు అసలు ఉన్నారా? అన్న అనుమానం కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలవడంతో కొంత ఆశలు పెరిగాయి. మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ గాడిన పడినట్లుందన్న కామెంట్స్ వినపడ్డాయి.
20 ఓవర్లలో 200 పరుగులు...
ఈరోజు గుజరాత్ టైటాన్స్ తో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఈ జట్టులో సాయి సుదర్శన్ 84 పరుగులు చేశాడు. కేవలం 49 బంతుల్లోనే సాయిసుదర్శన్ ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టారు. షారూక్ ఖాన్ కూడా ముప్పయి బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్స్ లు బాది 58 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 26 పరుగులు చేశాడు. సాహా ఐదు పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ శుభమన్ గిల్ 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈసారి కూడా బెంగలూరు జట్టులో బౌలర్లు పెద్దగా రాణించింది లేదనే చెప్పాలి. సిరాజ్, స్వప్నిల్ సింగ్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.
ఇద్దరూ కలసి....
201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టులో ఓపెనర్ గా దిగిన డూప్లిసెస్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 41 పరుగుల వద్ద అవుట్ కావడంతో మళ్లీ వీళ్లు మొదలెట్టేశారనిపించింది. కానీ విరాట్ కోహ్లి, జాక్స్ నిలదొక్కుకుని ఆడారు. పదమూడు ఓవర్లలోనే 134 పరుగులు చేశాడు. విరాట్ కొహ్లి 66పరుగులు చేశాడు. జాక్స్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ నిలబడి జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నట్లే కనిపించింది. ఇద్దరూ కలసి గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడేశారు. కోహ్లి, జాక్స్ కలసి మ్యాచ్ చేజారిపోకుండా అందిన బంతిని వీర బాదుడు బాదేసి మరో విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. విరాట్ కోహ్లి 70 పరుగులు, జాక్స్ సెంచరీ పూర్తి చేశాడు. నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకున్నారు. జాక్స్ సికర్లు బాదుతుంటే.. విరాట్ అవతలి ఎండ్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు
Next Story