Sun Dec 22 2024 22:12:44 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఇంత దారుణ ఓటమా? ఫైనల్స్లో ఇంత చెత్తగా ఎవరైనా ఆడతారా?
కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్స్ లో సన్రైజర్స్ హైదరాబాద్ భారీ ఓటమి చవి చూసింది
కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్స్ లో సన్రైజర్స్ హైదరాబాద్ భారీ ఓటమి చవి చూసింది. లీగ్ మ్యాచ్ లలో ఇరగదీసి ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ లో తడబడినా తేరుకుని ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఫైనల్స్ లో ఈసారి కప్పు గ్యారంటీ అనుకున్న సమయంలో దారుణ ఓటమిని సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫైనల్స్ లో ప్రతి ఒక్కరూ చేతులెత్తేసినట్లే కనిపించింది. అసలు ఫైనల్స్ లాగా మ్యాచ్ జరగలేదు. ఫైనల్స్ అంటే బంతి బంతికి టెన్షన్ తప్పదని అనుకుంటారు. అలాంటిది ఫలితం మ్యాచ్ ప్రారంభమయిన రెండు మూడు గంటల్లోనే తేలిపోయింది. కోల్కత్తా నైట్ రైడర్స్ గెలుపు ఖాయమని తేలిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసి...
తొలుత బ్యాటింగ్ కు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చిందనే చెప్పాలి. ఎవరూ కుదురుగా కాసేపు ఉండలేదు. కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు బలయిపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతుండటంతో ఇక సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసినట్లేనని అప్పుడే అభిమానులు అంచనాకు వచ్చారు. లీగ్ మ్యాచ్ లలో తొలుత బ్యాటింగ్ చేసి 280కి పైగా పరుగులు చేసి అనేక రికార్డులను తానే తిరగరాసిన జట్టు ఇలా ఫైనల్స్ లో చతికలపడటమేంటన్న ప్రశ్న అందరి మదిలో కనిపించింది. కాసుపు కూడా ఉండలేక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారంటే ఎంత దారుణంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఆడారో వేరే చెప్పాల్సిన పనిలేదు.
వరస బెట్టి...
అభిషేక్ శర్మ రెండు పరుగులకే అవుటయ్యాడు. హెడ్ డకౌట్ గా వెనుదిరిగాడు. త్రిపాఠి తొమ్మిది పరుగులు చేసి ఉస్సూరుమనిపించాడు. మార్క్రమ్ ఇరవై పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి పదమూడు, క్లాెస్ పదహారు, షాబాజ్ ఎనిమిది, కమిన్స్ 24 పరుగులు చేశారు. అంటే 18.3 ఓవర్లలో అదీ ఫైనల్స్ లో ఆల్ అవుట్ అయి కేవలం 113 పరుగులు మాత్రమే సన్రైజర్స్ హైదరాబాద్ చేయగలిగింది. ఇంత తక్కువ పరుగులు చేయడంతో కోల్కత్తా నైట్ రైడర్స్ దే విజయం ఖాయమని చూసే వారికి అందరికీ అర్థమయింది. ఛేదనలో కోల్కత్తా నైటర్స్ ఓపెనర్లుగా వచ్చిన గుర్బాజ్ 39 పరుగులు, నరైన్ ఆరు పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 52 పరుగులు, శ్రేయస్ ఆరు పరుగులు చేసి జట్టును ఛాంపియన్ గా నిలిపారు. 10.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని కోల్కత్తా నైట్ రైడర్స్ సాధించింది. కోల్కత్తా నైట్ రైడర్స్ IPL-2024 విజేతగా నిలిచింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది.
Next Story