Sun Dec 22 2024 22:22:40 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : హేమాహేమీల పోరు...చివరి వరకూ టెన్షన్ తప్పేట్లు లేదుగా.. ఈరోజు బంతితో బాక్స్లు పగిలిపోతాయా?
కోల్కత్తా నైట్ రైడర్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో తలపడనుంది
ఐపీఎల్ పదిహేడో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో తలపడనుంది. రెండు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అంటే రెండు జట్ల పెర్ఫార్మెన్స్ అదరహో అనే చెప్పాలి. రెండు జట్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిది అన్న అంచనాలు మాత్రం ఎవరికీ అందకుండా ఉంది. ఎందుకంటే ఉద్దండుల పోరు ఫ్యాన్స్ ఊగిపోయేలా చేస్తుందంటున్నారు. రెండు జట్లు మైదానంలోకి దిగిన వెంటనే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతుండటం ఇప్పటి వరకూ చూడటంతోనే ఇంతటి ఆసక్తి నెలకొంది.
తీసిపారేయలేని...
ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లను చూస్తే కోల్కత్తా నైట్ రైడర్స్ ఇరవై పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కూడా ఏ విషయంలోనూ తీసిపారేయలేకుండా ఉంది. పదిహేడు పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆ జట్టు నేరుగా ఫైనల్స్ కు చేరనుండటంతో రెండు జట్లు తెగించి పోరాడతాయన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సమఉజ్జీల పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతగా అంటే రెండు జట్లకు బలమైన ఫ్యాన్స్ ఉన్నారు. రెండు జట్లలో టీం ఇండియాకు చెందిన మేటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ తమ జట్టు గెలిస్తే బాగుంటుందని భావించే వారున్నారు. ఈఐపీఎల్ సీజన్ లో విదేశీ ఆటగాళ్లకు కూడా ఫ్యాన్స్ పెరిగారు.
బలాబలాలను...
రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే కోల్్కత్తా నైట్ రైడర్స్ లో మంచి హిట్టర్లున్నారు. నరైన్ నిలుచున్నాడంటే ఇక సిక్సర్ల మోతే. ఈ సీజన్ లో బాగా ఆడిన ఆటగాడిలో నరైన్ ఒకడు. ఇక వీరితో పాటు శ్రేయస్ అయ్యార్, నితీష్ రాణా, రింకూ వంటి వాళ్లతో కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ లోనూ నరైన్, వరుణ్, రసెల్, స్టార్క్లు రాణిస్తున్నారు. అలాగే హైదరాబాద్ జట్టు కూడా అంతే స్థాయిలో ఉంది. హెడ్, అభిషేక్ అతుక్కుపోయారంటే చాలు ఎంత స్కోరు అయినా ఉఫ్ అని ఊదేస్తారు. ఈ సీజన్ లో అనేక రికార్డులను సాధించిన జట్టు ఇది. తమ రికార్డులను తామే అధిగమించిన జట్టు కావడంతో అంచనాలు కూడా అధికంగానే ఉన్నాయి.
సత్తా ఉన్నోళ్లే...
క్లాసెన్, త్రిపాఠీలు కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ పరంగా సన్ రైజర్స్ కూడా బలంగానే కనిపిస్తుంది. నటరాజన్, భువనేశ్వర్, కమిన్స్ తో కావాల్సిన టైం లో వికెట్లు తీసుకుంటూ ప్రత్యర్థిని మట్టి కరిపించేంత సత్తా ఉన్నోళ్లు. అందుకే ఈ మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి. అయితే రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్లలో పదిహేడు సార్లు కోల్కత్తా నైట్ రైడర్స్ నెగ్గగా, తొమ్మిది సార్లు సన్ రైజర్స్ గెలిచింది. ఛేదనలో ఇరు జట్లు ముందున్నాయి. అందుకే ఈ మ్యాచ్ పై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. అంతే కాదు.. ఇప్పటి వరకూ ఆడింది ఒక ఎత్తు.. ఈ రోజు జరిగే మ్యాచ్ మరొక ఎత్తు. అందుకే ఈరోజు మైదానంలో ఎవరిది పై చేయి అవుతుందన్నది మాత్రం తేలకుండా ఉంది.
Next Story