Fri Dec 20 2024 16:57:41 GMT+0000 (Coordinated Universal Time)
వావ్.. ఇది కదా మ్యాచ్ అంటే?
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు చివరి బాల్ వరకూ ఉత్కంఠగా సాగింది
అందుకే ఐపీఎల్ క్లిక్ అయింది. అలాంటి షాట్లు... అలాంటి టెన్షన్ ఉండబట్టే లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ప్రతి ఏటా ఐపీఎల్ కోసం వేచి చూస్తున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నారు. మొన్న రింకూ వరసగా ఐదు సిక్సర్లు బాది కోల్కత్తా నైట్ రైడర్స్ను గెలిపిస్తే.. నేడు ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను పూరన్ తన బ్యాట్తో నిలబెట్టాడు. అందుకే ఐపీఎల్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎల్లప్పుడూ దానికి ఆదరణ ఉంటుంది. ఐపీఎల్లో ఇలాంటి విచిత్రాలు జరగడం సర్వసాధారణమే అయినా చేతికొచ్చిన మ్యాచ్ను చేజార్చుకున్న టీం మాత్రం చేసిన తప్పులను దిద్దుకోవాల్సి ఉంది.
చివరి బాల్ వరకూ...
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు చివరి బాల్ వరకూ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కొహ్లి 61, డుప్లిసెస్ 79 పరుగులు, మ్యాక్స్వెల్ 59 పరుగులు చేసి జట్టుకు 212 పరుగులు తెచ్చారు. విజయం తమదేనన్న ధీమాతో మైదానం నుంచి బయటకు వచ్చారు. ముగ్గురు ఓపెనర్లు వీరబాదుడు బాదడంతో ఇక విజయం బెంగళూరు వైపు ఉన్నట్లే అనిపించింది.
తొలుత తడబడినా...
దీనికి తోడు లక్నో జట్టు బ్యాటింగ్ చేపట్టిన తర్వాత తడబడింది. తొలి ఓవర్లోనే మేయర్స్ అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా కడా 9 పరుగులకే పెవిలియన్కు చేరుకున్నాడు. ఇక కృనాల్ పాండ్యా డకౌట్ తో వెనుదిరగడంతో ఇక బెంగళూరుదే ఖచ్చితమైన విజయమని, భారీ పరుగుల తేడాతో ఓటమి పాలవుతుందని అందరూ ఊహించారు. కాసేపటికి కేఎల్ రాహుల్ కూడా అవుట్ కావడంతో లక్నో అభిమానులు డీలా పడ్డారు. కానీ ఊహించనది జరిగితేనే అది ఐపీఎల్ అవుతుంది కదా. స్టాయినస్, పూరన్ లు విజృంభించి ఆడటంతో ఆటను తమ వైపునకు తిప్పుకున్నారు. అసాధ్యమన్నది సుసాధ్యం చేశారు. పూరన్ కేవలం 19 బంతుల్లో 62, స్టాయినిస్ 30 బంతుల్లో 65, ఆయుష్ బదోని 24 బంతుల్లో 30 పరుగుుల చేసి జట్టుకు విజయం సాధించి పెట్టారు. ఇది కదా మ్యాచ్ అంటే అనిపించారు.
Next Story