Mon Dec 23 2024 15:49:33 GMT+0000 (Coordinated Universal Time)
సస్పెన్స్ థ్రిల్లర్ కే చెమటలు పుట్టించిన మ్యాచ్..!
218 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఒక్క బంతి కూడా ఆడకుండానే ఓపెనర్ సునీల్ నరైన్ రనౌట్ అయ్యాడు. అరోన్ ఫించ్
ఐపీఎల్ అంటే భారీ స్కోర్స్ ఉండే మ్యాచ్ లు, సస్పెన్స్ థ్రిల్లర్ లను తలపించే ఫినిషింగ్ లు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నో కలిసి ఉంటాయి. అలాంటిదే గత రాత్రి జరిగింది. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. బట్లర్ ఈ సీజన్లో రెండో సెంచరీ సాధించడంతో రాయల్స్ 217 పరుగులు సాధించింది. ఆ తర్వాత బౌలింగులో యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించి రాయల్స్ కు విజయాన్ని అందించాడు.
రాజస్థాన్ రాయల్స్ టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బట్లర్ 61 బంతుల్లో 103 పరుగులు చేశాడు. బట్లర్ స్కోరులో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (24), కెప్టెన్ సంజు శాంసన్ (38)లతో కలిసి బట్లర్ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో షిమ్రోన్ హెట్మెయర్ (13 బంతుల్లో 26 నాటౌట్) ధాటిగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 200 మార్కు దాటింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా, పాట్ కమిన్స్ 1, ఆండ్రీ రస్సెల్ 1, శివం మావి 1 వికెట్ తీశారు.
218 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఒక్క బంతి కూడా ఆడకుండానే ఓపెనర్ సునీల్ నరైన్ రనౌట్ అయ్యాడు. అరోన్ ఫించ్ (28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 85) బాగా ఆడడంతో కేకేఆర్ విజయం దిశగా సాగుతూ వెళ్ళింది. అరోన్ ఫించ్ అవుటవ్వగా మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. చాహల్ వేసిన 17వ ఓవర్ నాలుగో బంతికి శ్రేయాస్ అయ్యర్ అవుటయ్యాడు. ఐదో బంతికి శివమ్ మావీ గోల్డెన్ డక్ అయ్యాడు. చివరి బంతికి పాట్ కమిన్స్ కూడా పెవిలియన్ కు పంపడంతో చాహల్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 180 పరుగులకే కేకేఆర్ 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అయితే, 18 ఓవర్లో ఉమేశ్ యాదవ్ మెరుపులు మెరిపించడంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఆ ఓవర్లో ఉమేశ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది స్కోరును 200కు చేర్చాడు.
చివరి రెండు ఓవర్లలో విజయానికి 18 పరుగులు అవసరం కాగా, 19వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి బంతికే జాక్సన్(8) అవుటయ్యాడు. మూడో బంతికి ఒక్క పరుగు వచ్చింది. నాలుగో బంతికి ఉమేశ్ యాదవ్ (21) అవుట్ కావడంతో.. 7 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్‌కు 5 వికెట్లు దక్కగా, ఓబెడ్ మెక్కాయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. చాహల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Next Story