Mon Dec 23 2024 16:07:27 GMT+0000 (Coordinated Universal Time)
బట్లర్ బాదుడే.. బాదుడు..
మొదటి ఇన్నింగ్స్ మొదలవ్వగానే బట్లర్ మేనియా మొదలైంది. రాజస్థాన్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదట్లో ఆచితూచి..
ముంబై : ఈ ఏడాది ఐపీఎల్ లో బట్లర్ చితక్కొడుతూ ఉన్నాడు..! 2016 ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఆడిన రేంజ్ లో బట్లర్ బౌలర్ల భరతం పడుతూనే ఉన్నాడు. మరో మ్యాచ్.. మరో విధ్వంసకర ఇన్నింగ్స్ అన్నట్లుగా సాగుతోంది బట్లర్ తీరు. ఢిల్లీ జట్టు.. రాజస్థాన్ రాయల్స్ తో ముంబయిలోని వాంఖెడే మైదానం వేదికగా తలపడింది. టాస్ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
మొదటి ఇన్నింగ్స్ మొదలవ్వగానే బట్లర్ మేనియా మొదలైంది. రాజస్థాన్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదట్లో ఆచితూచి ఆడిన బట్లర్.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. బట్లర్ సెంచరీ బాదడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. 65 బంతులు ఆడిన బట్లర్ 9 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్ 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసాడు. మరో ఓపెనర్ పడిక్కల్ 35 బంతులాడి 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 1, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు.
ఛేజింగ్ లో ఢిల్లీ ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. ధాటిగా ఆడుతున్న వార్నర్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 బంతుల్లో వార్నర్ 28 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ 44, లలిత్ యాదవ్ 37, ఆఖర్లో పావెల్ 36 పరుగులు చేసినా ఢిల్లీ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్ల పాటూ ఆడి 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్ లు బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్స్ లో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీయగా, మెక్ కాయ్, చాహల్ చెరో వికెట్ తీశారు. బట్లర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Next Story