Mon Dec 23 2024 01:46:43 GMT+0000 (Coordinated Universal Time)
ఐదోసారి టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్
లక్ష్యఛేదనలో 0.3 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 4 పరుగులు చేసిన అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ నిలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదో సారి టైటిల్ నెగ్గింది. ఆఖరి రెండు బంతులకు 10 పరుగులు కావాల్సి ఉండగా జడేజా ఒక 6, 4 తో మ్యాచ్ ను ముగించి చెన్నైకు విజయాన్ని అందించాడు. ఐపీఎల్ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది.
యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే 50 చేసిన సాయి సుదర్శన్ సెంచరీకి 4 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. 21 ఏళ్ల సాయిసుదర్శన్ మొత్తం 47 బంతులాడి 96 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలో సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ రెండు క్యాచ్ లు వదిలాడు. గిల్, సాహా మెరిశారు. సాహా 54, గిల్ 39 పరుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో పతిరణ 2, దీపక్ చహర్ 1, జడేజా 1 వికెట్ తీశారు.
ఇక లక్ష్యఛేదనలో 0.3 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 4 పరుగులు చేసిన అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ నిలిచింది. వర్షం తగ్గిన అనంతరం చెన్నై జట్టు లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. లక్ష్యఛేదనలో చెన్నై జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే తొలి వికెట్ కు 6.3 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. గైక్వాడ్ 26, కాన్వే 47 పరుగులు సాధించారు. వన్ డౌన్ లో వచ్చిన శివమ్ దూబే చివరి వరకు క్రీజులో నిలిచి 32 పరుగులు చేశాడు. రహానే 27 పరుగులు చేయగా... ఐపీఎల్ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న అంబటి రాయుడు 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 19 పరుగులు చేసి మ్యాచ్ లో చెన్నై అవకాశాలను సజీవంగా నిలిపాడు. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా మోహిత్ శర్మ మొదటి మూడు బంతులను అద్భుతంగా వేశాడు. నాలుగో బంతి 'లో హైట్' ఫుల్ టాస్ వేసినా శివమ్ దూబే సింగిల్ తో సరిపెట్టాడు. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా జడేజా సిక్సర్, ఫోర్ కొట్టి చెన్నైకు 5వ సారి టైటిల్ ను అందించాడు.
Next Story