Fri Dec 20 2024 16:45:24 GMT+0000 (Coordinated Universal Time)
బెట్టింగ్ బాబులూ... అంచనాలు మిస్ అవుతున్నాయా?
ఐపీఎల్ ప్రారంభమయిందంటే బెట్టింగ్లకు కొదవ ఉండదు. సాధారణంగా గెలిచే టీంను ముందుగానే అంచనా వేసి బెట్టింగ్లు కడుతుంటారు.
ఐపీఎల్ ప్రారంభమయిందంటే బెట్టింగ్లకు కొదవ ఉండదు. సాధారణంగా గెలిచే టీంను ముందుగానే అంచనా వేసి బెట్టింగ్లు కడుతుంటారు. కానీ ఈసారి అందరి అంచనాలు తలకిందులవుతున్నాయి. దీంతో బెట్టింగ్ నిర్వహించే వారికి, ఆడేవారికి కూడా ఎటూ పాలుపోవడం లేదు. చివరి బంతి వరకూ ఎవరిది విజయమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న మ్యాచ్లు చూసి బెట్టింగ్లకు పాల్పడే వాళ్లు బెంబేలెత్తి పోతున్నారు. తాము స్కోరును బట్టి.. జట్టును బట్టి.. అందులో సభ్యులను బట్టి.. అంచనా వేసి బెట్టింగ్లను కడుతున్నా చివరకు కోల్పోతుండటంతో దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల సొమ్ము క్షణాల్లో ఆవిరిగా మారుతుందంటున్నారు.
అంచనాలకు భిన్నంగా...
సాధారణంగా అభిమానంతో కొందరు.. జట్టును.. జట్టులో సభ్యుల ఆటతీరు.. వారు ఫామ్ లో ఉన్నారా? లేదా? అని గుర్తించి బెట్టింగ్లు కడుతుంటారు. కొందరు అభిమానంతో బెట్టింగ్లు కడుతుంటే.. మరికొందరు కేవలం డబ్బుల కోసమే ఈ జూదక్రీడను ఆడటం మొదలుపెట్టారు. అయితే ఎవరి అంచనాలు ఊహించని విధంగా మైదానంలో చివరకు వారు అనుకున్న జట్టు గెలవడం లేదు. గెలుస్తారనుకున్న జట్టు ఓటమిపాలవుతుంటే... ఓడిపోతుందనుకున్న టీం గెలిచి తొడ కొడుతుంది. దీంతో బెట్టింగ్ లు కట్టడానికే భయపడిపోతున్నారు. ఎంత పెద్ద స్కోరు ఉన్నా చివరి నిమిషం వరకూ విజేత ఎవరో తేల్చడం ఈ ఐపీఎల్ లో కష్టంగా మారింది. అన్ని జట్లు శ్రమించి మైదానంలో పోరాడుతున్నాయి.
ఏ జట్టులో ఏ ఆటగాడు..
చిన్నా లేదు.. పెద్దా లేదు.. ఎవరు ఏ ఆటగాడు సిక్సర్ కొడతాడో తెలియదు. వికెట్లు తీయడనుకున్న బౌలర్ టపా టపా వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని తెచ్చిపెడుతున్నాడు. కొందరైతే సిక్సర్ల మోతతో విజయ దుంధుభి మోగిస్తున్నారు. ఇలా సాగుతున్న తరుణంలో బెట్టింగ్ కట్టే వాళ్లు కొంత వెనకడుగు వేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇటీవల గుజరాత్ టైటాన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టులో ఈ విషయం స్పష్టమయింది. ఎనిమిది బంతుల్లో 38 పరుగులు చేయాలి. ఇది అసాధ్యం. అందరికీ తెలుసు. మూడు సిక్సర్లు వరకూ ఓకే. కానీ రింకూ సింగ్ ఏకంగా ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయం చేకూర్చాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ పై భారీ బెట్టింగ్ లు పెట్టిన వాళ్లు నెత్తిన గుడ్డ వేసుకున్నారు. వారు పెట్టిన డబ్బులన్నీ రింకూ సింగ్ క్షణాల్లో ఆవిరి చేశాడు.
వరసగా అన్ని జట్లు...
మొన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబయి ఇండియన్స్ జట్టు పోరు కూడా చివరి వరకూ విజయం ఎవరిదో ఊగిసలాడింది. ఎవరిది విజయమో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థిితి. కానీ చివరకు ఒక బంతితో రెండు పరుగులు చేయాల్సి ఉండగా ముంబయి జట్టు చేసి గెలిచింది. ఇక తాజాగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కూడా అంతే. తక్కువ పరుగుల లక్ష్యంతోనే బరిలోకి దిగినా వికెట్లు వరసగా పడిపోవడంతో కోలుకోలేని దెబ్బతగలింది. చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా మహేంద్ర సింగ్ ధోని క్రీజులో ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు తధ్యమని భావించారు. కానీ చివరి బంతికి ధోని రెండు పరుగులే చేయడంతో రాజస్థాన్ రాయల్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అందుకే ఏ జట్టు గెలుస్తుంది? ఏ ఆటగాడు అర్ధ సెంచరీ చేస్తాడు? ఏ బౌలర్ వికెట్లు అత్యధికంగా తీస్తారన్నది ఈ ఐపీఎల్ లో మాత్రం అంచనా వేయలేని పరిస్థిితి. కాబట్టి.. బెట్టింగ్ బాబులూ.. పారాహుషార్.. బెట్టింగ్లు కట్టారో... మీ జేబులు లూటీ అయినట్లే.
Next Story