Mon Dec 23 2024 15:36:35 GMT+0000 (Coordinated Universal Time)
వరుసగా 5వ పరాజయం మూటగట్టుకున్న కేకేఆర్..!
కుల్దీప్ యాదవ్ ధాటికి కోల్ కతా నైట్ రైడర్స్ విలవిల్లాడింది. కుల్దీప్ యాదవ్ కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా...
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వరుసగా 5వ మ్యాచ్ ఓడిపోయింది. ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగా.. ఢిల్లీ ఛేజింగ్ లో కాస్త తడబడినా.. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో అడుగుపెట్టాడు.
కుల్దీప్ యాదవ్ ధాటికి కోల్ కతా నైట్ రైడర్స్ విలవిల్లాడింది. కుల్దీప్ యాదవ్ కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా... కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (42), బాబా ఇంద్రజిత్ (6), సునీల్ నరైన్ (0), ఆండ్రీ రస్సెల్ (0)లను పెవిలియన్ చేర్చి కోల్ కతాను భారీ స్కోర్ చేయనివ్వకుండా అడ్డుకున్నాడు. మిడిలార్డర్ లో నితీశ్ రాణా (57), లోయరార్డర్ లో రింకు సింగ్ (23) రాణించడంతో కోల్ కతా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లెఫ్టార్మ్ సీమర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ఆఖర్లో కట్టడి చేశాడు. కోల్ కతా జట్టులో నితీశ్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్ మినహా మిగిలినవాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ముస్తాఫిజూర్ కు 3 వికెట్లు దక్కగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, చేతన్ సకారియా చెరో వికెట్ తీశారు.
ఇక ఛేజింగ్ లో ఢిల్లీకి మొదటి ఓవర్ లోనే ఉమేష్ యాదవ్ షాక్ ఇచ్చాడు. మంచి ఫామ్ లో ఉన్న పృథ్వీ షాను గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు ఉమేష్ యాదవ్. ఆ తర్వాత మిచెల్ మార్ష్ రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనపడినా పెద్దగా ప్రభావం చూపకుండా పెవిలియన్ కు చేరాడు. మరో ఎండ్ లో డేవిడ్ వార్నర్ ఫోర్లను బాదుతూ తాను ఎంత విలువైన ఆటగాడినో మరోసారి రుజువు చేశాడు. 26 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో సునీల్ నరైన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 22 పరుగులు చేసిన లలిత్ యాదవ్ పెవిలియన్ కు చేరడం, పంత్ కూడా 2 పరుగులకే ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అవ్వడంతో నైట్ రైడర్స్ శిబిరంలో ఆనందం కనిపించింది. అయితే ఆఖర్లో పావెల్, అక్షర్ పటేల్ రాణించడంతో ఢిల్లీ విజయానికి చేరువైంది. అక్షర్ పటేల్(24) రనౌట్ గా వెనుదిరిగినా పావెల్.. శార్ధూల్ ఠాకూర్ సహాయంతో విజయాన్ని ఖరారు చేశాడు. పావెల్ 16 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ బాది 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సంచలన బౌలింగ్ వేసిన కుల్దీప్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Next Story