Tue Nov 05 2024 23:26:28 GMT+0000 (Coordinated Universal Time)
కోహ్లీ.. ఐపీఎల్ నుండి తప్పుకో..!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కోహ్లీకి కీలక సూచన చేశాడు. విరాట్ వెంటనే ఐపీఎల్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలని
ముంబై : టీమిండియా మాజీ సారథి కోహ్లీ ఐపీఎల్ లో ఎంత ఘోరంగా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి ఫామ్ ప్రతి ఒక్క క్రికెట్ అభిమానిని కలవరపెడుతూ ఉంది. కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ చూస్తామని మనం ఎంతో ఆతృతగా ఎదురుచూడడం.. కోహ్లీ ఘోరంగా అవుట్ అవ్వడం.. ఇలాగే సాగుతోంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కోహ్లీ పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 128 పరుగులు మాత్రమే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచుల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన గత మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చి 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కోహ్లీకి కీలక సూచన చేశాడు. విరాట్ వెంటనే ఐపీఎల్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. ఏకధాటిగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి కాస్తంత విరామం అవసరమని అన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు సారథిగా వ్యవహరించిన కోహ్లీకి ఇప్పుడు విశ్రాంతి కావాలని, మైండ్ను ఫ్రెష్ చేసుకోవాలని సూచించాడు. తన అంతర్జాతీయ కెరియర్ను పొడిగించుకోవాలనుకున్నా, క్రికెట్లో మరో ఆరేడేళ్లపాటు ప్రయాణం ముందుకు సాగాలన్నా.. కోహ్లీ తక్షణం ఐపీఎల్ నుంచి తప్పుకోవడం మంచిదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు ఆడాలనుకునే వారు ఎవరైనా సరే ఓ గీత గీసుకోవాలని, టీమిండియాకు మ్యాచ్లు లేనప్పుడు విశ్రాంతి తీసుకోవాలని అన్నాడు. అంతర్జాతీయ ఆటగాడిగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని రవిశాస్త్రి సూచించాడు.
Next Story