Fri Dec 20 2024 10:57:40 GMT+0000 (Coordinated Universal Time)
పడగొడితే.. పొగడ్తలు.. కొడితే తెగడ్తలు
పదమూడు పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
పాపం.. అర్ష్ దీప్ సింగ్.. క్రికెట్లో ఎక్కువ ట్రోల్ అయ్యే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అర్హదీప్ సింగ్ అనే చెప్పుకోవాలి. డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చి ఓటమికి కారణమయితే నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతారు. అర్హదీప్ను కామెంట్లతో చంపేస్తుంటారు. ఏ బౌలర్ ఎక్కువ పరుగులు చేయాలని బంతి విసరడు. అర్షదీప్ కూడా అంతే. డెత్ ఓవర్లో బౌలింగ్ చేయడమంటే ఆషామాషీ కాదు. ఎంత వత్తిడి ఉంటుంది. గ్రౌండ్లో కూర్చుని.. టీవీల ముందు కూర్చున్న వాళ్లకు అది తెలియకపోవచ్చు. కానీ అర్హదీప్ దేనినైనా సులువుగా తీసుకుంటాడు. అదే అతనికి వరం. ఒక చిరునవ్వుతో తనకు వ్యతిరేకంగా వచ్చిన కామెంట్సకు కూడా సమాధానమివ్వడం ఆ ఆటగాడి సొంతం.
ఊదిపారేసేలా కనిపించినా...
ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ నడుస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 214 పరుగులు చేసింది. ఐపీఎల్లో అది భారీ స్కోరు. దానిని అధిగమించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంది. ఇక వరస విజయాలతో ఊపు మీదున్న ముంబయి జట్టు ఆ స్కోరును ఒక దశలో ఊదిపారేసేలా కనిపించింది. గ్రీన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్‌లు ఉన్నంత సేపు విజయం ముంబయి వైపు మాత్రమే ఉంది. ముంబయి గెలిచేసినట్లేనని ఆ జట్టు యజమాని నీతూ అంబానీ సైతం ఉత్సాహంగా గ్యాలరీలో కనిపించారు. పంజాబ్ కింగ్స్ జట్టులో నవ్వులు కొరవడ్డాయి. కేరింతలన్నీ ముంబయి జట్టు అభిమానులవే. పంజాబ్ అభిమానులు సైలెంట్‌గానే ఉన్నారు.
చివరి ఓవర్‌కు...
ఆ సమయంలో చివరి ఓవర్ అర్షదీప్ చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్ అయిపోయినట్లేనని అనుకున్నారు. ఆరు బంతులకు పదహారు పరుగులు చేయాల్సి ఉంది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నారు. ఇద్దరూ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లే కావడంతో అందరూ ముంబయిదే విజయం ఖాయమని అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో అంత వత్తిడి మధ్య అర్హదీప్ సింగ్ తన బంతిని విసిరాడు. తిలక్ వికెట్‌ను విరగ్గొట్టేశాడు. నేహెల్ వధేరాను కూడా వెనువెంటనే ఇంటికి పంపాడు. రెండుసార్లు మిడిల్ వికెట్లు విరిగిపడటం ఒక ప్రత్యేకత. ఇక ముంబయి ఆశలు గల్లంతయ్యాయి. చివరకు పదమూడు పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఇక అర్హదీప్ మీద ప్రశంసలే ప్రశంసలు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన అర్హదీప్ సింగ్‌ను నెటిజెన్లు కూడా పొగడ్తలో ముంచెత్తుతున్నారు. అదే ఎక్కువ పరుగులు ఇచ్చి పంజాబ్ ఓటమి పాలయి ఉంటే తిట్టే తిట్లు అన్నీ ఇన్నీ కావు. అదీ పాపం.. సింగ్ పరిస్థితి.
Next Story