Mon Nov 18 2024 00:16:25 GMT+0000 (Coordinated Universal Time)
ధోనికి కెప్టెన్సీ అప్పజెప్పగానే.. చెన్నై సూపర్ విక్టరీ
203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేసింది..
ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీని అందుకుంది. సన్ రైజర్స్ బౌలింగ్ ను చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఎంతో అలవోకగా ఆడేశారు. రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేయగా, డెవాన్ కాన్వే 55 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గైక్వాడ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నటరాజన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆఖర్లో వచ్చిన ధోనీ 8 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లో కాన్వే బ్యాట్ ఝుళిపించడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీశాడు.
203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేసింది సన్ రైజర్స్. 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39)-కెప్టెన్ కేన్ విలియమ్సన్ (47) తొలి వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అభిషేక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. మార్కరమ్ 17 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. వరుస బంతుల్లో మిచెల్ శాంట్నర్ కు రెండు సిక్సర్లు కొట్టిన మార్కరమ్.. ఆ తర్వాత జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పూరన్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులు చేసి విజయంపై ఆశలు రేపాడు. అయితే, శశాంక్ సింగ్ (15), వాషింగ్టన్ సుందర్(2) ఆఖర్లో విఫలమయ్యారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 4 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Next Story