Mon Dec 23 2024 09:53:10 GMT+0000 (Coordinated Universal Time)
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల బ్యాటింగ్ పై దాదా కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వారి ఫామ్ పై ఓ టీవీ ఇంటర్వ్యూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముంబై : IPL-2022లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఎంతో ఘోరంగా ఆడుతున్న సంగతి తెలిసిందే..! రోహిత్ శర్మ ను ఎంతో సులువుగా బౌలర్లు అవుట్ చేస్తూ ఉండగా.. విరాట్ కోహ్లి అవుట్ అవుతున్న తీరు భారత క్రికెట్ అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. కోహ్లి ఆడుతాడని మనం ఆశించడం.. కోహ్లీ నిమిషాలలో పెవిలియన్ చేరడం.. ఇలా సాగుతోంది. ఇక రోహిత్ శర్మ సరిగా ఆడకపోవడానికి తోడు.. ముంబై ఇండియన్స్ పరాజయాలు అతడి కెప్టెన్సీ మీద ప్రభావం చూపుతాయేమోనని భయం మరో వైపు వెంటాడుతూ ఉంది. బ్యాట్‌తో ఈ ఇద్దరూ పెద్దగా రాణించడం లేదు. ఇద్దరూ తమ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా మెరుపులు మెరిపించడంలో విఫలమయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లీ, రోహిత్ పేలవమైన ఫామ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తాజాగా భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వారి ఫామ్ పై ఓ టీవీ ఇంటర్వ్యూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ, రోహిత్ శర్మ గొప్ప ఆటగాళ్లనడంలో సందేహంలేదని, వారిద్దరూ తప్పకుండా ఫామ్ లోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే వాళ్లు పరుగులు సాధించడం మొదలు పెడతారని తెలిపారు. ప్రస్తుతం కోహ్లీ మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తనకు తెలియడంలేదని, కానీ అతడు మునుపటి ఫామ్ ను అందుకుని స్కోరుబోర్డును పరుగులెత్తించడం మళ్లీ చూస్తామని గంగూలీ అన్నారు. కోహ్లీ మేటి ఆటగాడని కితాబిచ్చారు. ఐపీఎల్ ను తాను కూడా చూస్తున్నానని, ఎంతో ఆసక్తికరంగా సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా, కొత్త జట్లు గుజరాత్, లక్నో చాలా బాగా ఆడుతున్నాయని ప్రశంసించారు. కోహ్లీ 9 మ్యాచ్ ల్లో 128 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 8 మ్యాచ్ ల్లో 153 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేస్తే చాలు చూడాలని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు.
Next Story