Fri Nov 22 2024 08:10:32 GMT+0000 (Coordinated Universal Time)
Jammu And Kashmir Elections : ప్రచారంతో వేడెక్కిన జమ్మూ కాశ్మీర్.. ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమయింది. 90 స్థానాలకు జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమయింది. 90 స్థానాలకు జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా ఈ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 18వ తేదీన 24 అసెంబ్లీ స్థానాలకు, సెప్టెంబరు 25వ తేదీన 26 అసెంబ్లీ స్థానాలకు, అక్టోబరు 1వ తేదీన 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అక్టోబరు 4వ తేదీన జరగనుంది. కొన్ని దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలూ ప్రజా తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 370 ఆర్టికల్ తో పాటు 35 A రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజలు ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది ఉత్కంఠగా మారింది.
మరో రెండు రోజుల్లో...
జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. 2014 నుంచి జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు జరగలేదు. రాష్ట్రపతి పాలనలోనే జమ్మూకాశ్మీర్ ఉంది. ఉగ్రవాదం, వేర్పాటువాద సమస్యలతో అట్టుడికిపోతున్న జమ్మూకాశ్మీర్ లో ప్రజాపాలనను, ప్రజాస్వామ్యాన్ని తీసుకు వచ్చేందుకు ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఇందుకోసం 11 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 87 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా తొలి దశ ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. దీంతో భద్రతను భారీగా పెంచారు. సాయుధ బలగాలతో పటిష్టమైన కాపలాతో భద్రతాసిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు.
అన్ని పార్టీలూ...
ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు రాష్ట్రంలో పర్యటించి తమకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రత్యర్థి పార్టీలకు అవకాశమిస్తే వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తారని, శాంతిభద్రతలు నెలకొనాలంటే కమలం పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. మరో వైపు ఎన్డీఏ కూటమి కూడా బలంగా కనిపిస్తుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో అది పొత్తు కుదుర్చుకుంది. మరో వైపు పీడీపీ కూడా పోటీ చేస్తుండగా ఎవరిది గెలుపు అన్నది మాత్రం చివరి నిమిషం వరకూ చెప్పలేమంటున్నారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఎన్నికల బరిలోకి దిగింది. అగ్రనేతలు పార్టీని వదిలి వెళ్లిపోవడంతో అది ఆపసోపాలు పడుతుంది. 2014 ఎన్నికల్లో పీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతోనే అది బలహీనపడిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మొత్తం మీద ఎల్లుండి నుంచి జరబోయే ఎన్నికలకు జమ్మూకాశ్మీర్ ప్రజలు సిద్ధమవుతున్నారు. చివరకు గెలుపు అన్నది మాత్రం ఎవరన్నది తేలాల్సి ఉంది.
Next Story