Sun Dec 22 2024 10:07:50 GMT+0000 (Coordinated Universal Time)
Jammu and Haryana Elections : ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి? ఎవరికి గుణపాఠం?
హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీ లకు ఒక గుణపాఠాన్ని నేర్పాయి
హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరికి పాఠాలు నేర్పాయి? రెండు జాతీయ పార్టీలు తమ తప్పొప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళతాయా? లేక రానున్న ఎన్నికల్లోనూ ఇదే తరహా ధీమాతో వ్యవహరిస్తారా? అన్నది వారి విజ్ఞతకే వదిలేసినా ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం రెండు పార్టీలకు చెంపపెట్టు లాంటివేనని చెప్పకతప్పదు. హర్యానాలో చేతికి వచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ చేజేతులా కోల్పోయింది. జమ్మూ కాశ్మీర్ లో తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఈ రెండు ఫలితాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు తగిన గుణపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
హర్యానాలో...
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలను ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చింది. ఉచితాలను తమ మ్యానిఫేస్టోలో చెప్పేసింది. కర్ణాటక, తెలంగాణ తరహాలోనే హర్యానాలో కూడా తమ విజయం ఖాయమని హస్తం పార్టీ భావించింది. దీనికి తోడు బీజేపీ పదేళ్లు అధికారంలో ఉండటంతో ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. ఇలా అన్ని రకాలుగా కాంగ్రెస్ తనకు గ్రౌండ్ క్లియర్ అవుతుందని భావించింది. దీంతో నిర్లక్ష్యం కూడా కాంగ్రెస్ నేతలకు తోడయింది. నేతల మధ్య అనైక్యత, అతి విశ్వాసంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని, సోషల్ ఇంజినీరింగ్ చేస్తూ ముందుకు వెళ్లడంతో అత్యధిక స్థానాలను సాధించగలిగింది.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో...
ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బతినింది. తాను వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. 370 ఆర్టికల్ రద్దుతో పాటు డీ లిమిటేషన్ తో తనకు పట్టున్న జమ్మూలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుకోవడం తనకు లాభిస్తుందని కమలం పార్టీ భావించింది. దీంతో పాటు ఇతర పార్టీలేవీ బీజేపీతో కలిసేందుకు ముందుకు రాలేదు. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ మాత్రం కొంత వ్యూహంతో వెళ్లింది. నేషనల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. బీజేపీపై వ్యతిరేకత జమ్మూ కాశ్మీర్ లో స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనపడింది. ప్రజలు వన్ సైడ్ గా కాంగ్రెస్ కూటమి వైపు నిలబెట్టారు. రానున్న కాలంలో మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లోనూ ఇదే రకమైన ధీమాను ప్రదర్శించి, అతి విశ్వాసానికి వెళితే మాత్రం ఆ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పదు.
Next Story