Sun Dec 22 2024 11:17:46 GMT+0000 (Coordinated Universal Time)
Jammu Kashmir Elections : ఉగ్రవాదుల దాడిలో తండ్రిని కోల్పోయి.. 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన షాగున్ పరిహార్
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో షాగున్ పరిహార్ 29 ఏళ్ల వయసుకే ఎమ్మెల్యే అయ్యారు. ఆమె ఉగ్రవాదుల దాడుల్లో తండ్రి, మామను కోల్పోయారు
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అత్యధిక స్థానాలతో విజయం సాధించింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ పాగా వేయగలిగింది. తనకు పట్టున్న జమ్మూలోనూ బీజేపీ పెద్దగా స్థానాలను సాధించలేకపోయింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే అందులో 49 స్థానాలను కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాలను సాధించిందని తృప్తి మిగుల్చుకుంది. బీజేపీ 29 స్థానాలకు మాత్రమే పరిమితమయింది.
అతి చిన్న వయసులో...
అయితే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థిని గురించి తెలుసుకుందాం. ఆమె షాగున్ పరిహార్. 29 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ తరుపున పోటీ చేసి జమ్మూ కాశ్మీర్ లో గెలిచిన ముగ్గురు మహిళా అభ్యర్థుల్లో ఆమె ఒకరు. కిష్త్వార్ నియోజకవర్గం నుంచి షాగున్ పరిహార్ పోటీ చేశారు. ఆమె నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు సజాద్ అహ్మద్ కిచ్లూను 521 ఓట్ల తేడాతో ఓడించగలిగారు.
ఉగ్రవాదుల దాడుల్లో...
అయితే షాగున్ పరిహార్ ఎన్నికలో నిలబడటమే కాకుండా గెలవడం కూడా ఒక రికార్డు అని చెప్పుకోవాలి. ఆమె హిజాబ్ ఉగ్రవాదుల దాడుల్లో తండ్రిని, మామను కోల్పోయారు. షాగున్ పరిహార్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని చదువుతున్నారు. తన తండ్రి, మామాను ఉగ్రవాదుల దాడుల్లో కోల్పోయిన ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచిన తర్వాత ఆమె మాట్లాడుతూ తనపైన,పార్టీపైన విశ్వాసం ఉంచినందుకు కిష్త్వార్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు.
ఈ విజయం వారికే...
వారి మద్దతుతో తాను నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని మీడియాకు వివరిాంచారు. ఈ విజయం తనది మాత్రమే కాదని, జాతీయవాదాన్ని ఆకాంక్షించే ప్రజలందరిదీ అని ఆమె చెప్పారు. కిష్త్వార్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడమే తన ధ్యేయమన్న షాగున్ పరిహార్ ఈ ఎన్నికలు తన కుటుంబం మాత్రమే కాకుండా దేశం కోసం త్యాగం చేసిన వారందరిదీ అని అన్నారు. పరిహార్ విజయం కోసం ప్రధాని మోదీ, అమిత్ షా ప్రచారం చేశారు. ఉగ్రవాదంపై పోరాడి దేశాన్ని రక్షించడంలో తమ ప్రాణాలను అర్పించిన వారందరకీ తన విజయం అంకితం షాగున్ పరిహార్ తెలిపారు.
Next Story