Sat Dec 21 2024 05:08:03 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు గుడ్న్యూస్..5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపింపి ప్రభుత్వం. ఎట్టకేలకు నిరుద్యోగుల కల..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపింపి ప్రభుత్వం. ఎట్టకేలకు నిరుద్యోగుల కల నెరవేరింది. తెలంగాణలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ నోటిఫికేషన్ రెండు రోజుల కిందటనే విడుదల చేసినా.. దీనిని బయటపెట్టలేదని, ఇప్పుడు విడుదల చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్ష-2023 నిర్వహించనున్నారు. అయితే పశ్నాపత్రాల లీకేజీ లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఆన్ లైన్ లో టీఆర్ఐ పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.
ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలపై నిరుద్యోగ అభ్యర్థులు విద్యాశాఖపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నెల 6నే నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ బయట పెట్టకుండా ఆలస్యం చేసిందని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల తర్వాత తీరిగ్గా విద్యాశాఖ అధికారులు నోటిఫికషన్ను బయటపెట్టారు. టీచర్ నియామక నోటిఫికేషన్ విడుదల లోనూ విద్యాశాఖ అధికారుల మొద్దు నిద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగస్టు 24 ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులున్నాయి. వీటన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే టెట్ పరీక్షలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏండ్ల లోపు ఉండాలి.
Next Story