Mon Dec 23 2024 09:31:36 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్సై పోస్టులకు ఆగస్టు 7న, కానిస్టేబుల్ పోస్టులకు 21వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు
ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయని తెలిపింది.
తెలంగాణలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న ఎస్సై పోస్టులకు ఆగస్టు 7న, కానిస్టేబుల్ పోస్టులకు 21వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం పరీక్షల తేదీలను ప్రకటించింది. ఎస్సై అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ నుంచి, కానిస్టేబుల్ పరీక్షలకు పోటీ పడేవారు వచ్చే నెల 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, హాల్ టికెట్లను www.tslprb.in వెబ్ సైట్ లో పొందవచ్చని సూచించింది. మొత్తం 554 ఎస్సై పోస్టులు ఉన్నాయి. ఇక 15,644 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి తోడు 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులనూ భర్తీ చేయనున్నారు. ఎస్సై పోస్టులకు 2.54 లక్షల మంది, కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సై పోస్టులకు హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో, కానిస్టేబుల్ పరీక్షలకు 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు.
Next Story