Fri Nov 22 2024 09:27:04 GMT+0000 (Coordinated Universal Time)
KCR : బస్సు యాత్ర అందుకేనట.. ఈ యాత్రతో గ్రౌండ్ లెవెల్లో క్లారిటీ కోసమేనట
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు రోజుల నుంచి జనంలో ఉన్నారు. బస్సు యాత్రతో జనానికి చేరువవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు రోజుల నుంచి జనంలో ఉన్నారు. బస్సు యాత్రతో ఆయన జనానికి చేరువవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అత్యధిక స్థానాల్లో గెలిపించి తన నాయకత్వంలో ఇంకా పస తగ్గలేదని నిరూపించుకోదలచుకున్నారు. అన్ని రకాలుగా ఈ ఎన్నికలు ఆయనకు ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. ఈ గెలుపుతో తానేంటో చూపించాలని భావిస్తున్నారు. తనపైనా, నాయకత్వంపైనా, పార్టీపైన వచ్చే విమర్శలకు చెక్ పెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు. తనపైనా, పార్టీ పైన నోరుపారేసుకునే వాళ్ల కళ్లు తెరిపించాలని ఆయన పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. అయితే అది ఎంత వరకూ సాధ్యమన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నేటికి బీఆర్ఎస్ ఏర్పడి 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ ఏట అడుగుపెడుతుంది. ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటుంది.
ఓటమి తర్వాత...
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ లో సీనియర్ నేతలు కూడా అవాకులు, చెవాకులు పేలి పార్టీని వీడుతున్నారు. తాను పదవి ఇచ్చిన నేతలే తనకు ఎదురుతిరుగుతున్నారు. నియంత అని ముద్ర వేసి మరీ వెళుతున్నారు. అందుకే ఆయన తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. చివరకు పార్టీ ఓటమి తర్వాత తనతో పదేళ్ల పాటు నడిచిన ఎంఐఎం వంటి పార్టీ కూడా హ్యాండ్ ఇవ్వడం ఆయనకు మింగుడుపడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న వారు, తన చేత అన్ని పనులు చేయించుకున్న వారు అధికార మార్పిడి జరిగిన వెంటనే జారుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎనిమిది స్థానాల్లో...
కనీసం ఎనిమిది స్థానాలలో పార్టీని గెలిపించే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఎనిమిది స్థానాల్లో కనీసం విజయం సాధిస్తే ఢిల్లీ స్థాయిలో తన పరపతి పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. బీజేపీ స్పీడ్ కు ఒకింత కళ్లెం వేయవచ్చన్న భావనలో ఆయన ఉన్నారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని వత్తిడి వస్తున్నా ఎన్నికల కమిషన్ అందుకు ఒప్పుకోదని, కనీసం ఐదేళ్లు సమయం ఉండాలని అంటూ పార్లమెంటు ఎన్నికలకు మాత్రం బీఆర్ఎస్ పేరుతోనే వెళుతున్నారు. పేరు మార్పిడి తనకు కలసి రాదన్న వాదనను ఆయనను కొట్టి పారేస్తున్నారు. బీఆర్ఎస్ పేరు మీదనే గెలిపించి తన సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విఫలమయితే పార్టీ పరంగా మరింత ఇబ్బందులు ఎదురవుతాయని ఆయనకు తెలియంది కాదు. అందుకే బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళుతున్నారు.
కొంత రిలాక్స్ గానే...
జనంలో మాత్రం మంచి స్పందనే కనిపిస్తుంది. ఆయనను చూసేందుకు వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. నేతలు పార్టీని వీడి వెళ్లినా కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను పట్టుకోవడాన్ని చూసిన ఆయన కొంత రిలాక్స్ అయినట్లు కనిపిస్తుందంటున్నారు. నేతలను ఎప్పుడైనా, ఎక్కడైనా తయారు చేసుకోవచ్చని కార్యకర్తలు మాత్రం దొరకరన్నది ఆయన నమ్మకం. అందుకే ఈ బస్సు యాత్ర ద్వారా పార్టీ బలమేంటో కూడా కేసీఆర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అందుకే పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీలో పూర్తిగా ప్రక్షాళన చేపట్టేందుకు గులాబీబాస్ సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తుంది. కారు పార్టీ బస్సు యాత్రతోనైనా విజయం సాధిస్తుందా? లేక అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఫస్ట్ గేర్ కే పరిమితమవుతుందా అన్నది చూడాల్సి ఉంది.
Next Story