Mon Nov 18 2024 12:44:49 GMT+0000 (Coordinated Universal Time)
Kishan Reddy : ఈసారి కిషన్ రెడ్డికి బాగానే పోటీ ఉంది.. మంత్రి పదవిపై ఇప్పటి నుంచే కొట్లాట
మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కిషన్ రెడ్డికి కొంత మంత్రి పదవి విషయంలో ఇరాకాటం తప్పదంటున్నారు.
కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ నమ్మకంగా ఉంది. నాలుగు వందల స్థానాలు లక్ష్యంగా ఇప్పటికే మోదీతో పాటు అగ్రనేతలందరూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే ఈసారి కేంద్ర కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై కూడా ఇప్పటి నుంచే అనేక రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గెలిచినా మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడోసారి ముచ్చటగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం కిషన్ రెడ్డికి కొంత మంత్రి పదవి విషయంలో ఇరాకాటం తప్పదంటున్నారు.
ఇప్పటికే పార్టీ లో సీనియర్ నేత లక్ష్మణ్ రాజ్యసభ పదవిలో ఉన్నారు. ఆయనను ఏరికోరి అధినాయకత్వం రాజ్యసభకు ఎంపిక చేసింది. ఈసారి కేబినెట్ లో ఆయనకు చోటు దక్కే అవకాశముందని చెబుతున్నారు. ఓబీసీ నేతగా కూడా ఆయనకు మంత్రి పదవి దక్కడానికి ఎక్కువ మార్కులు పడతాయంటున్నారు. దీంతో పాటు సీనియారిటీ, సిన్సియారిటీని చూసుకున్నా లక్ష్మణ్ ను వేలెత్తి చూపేవారు ఎవరూ ఉండరు. అందుకే ఈసారి కె. లక్ష్మణ్ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో గట్టి పోటీ ఉండే అవకాశముంది. అందులోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చేసిన వాగ్దానం కూడా కె. లక్ష్మణ్ వైపు చూపుతుందంటున్నారు.
మహిళ కోటా కింద...
ఇక మరో కీలక నేత డీకే అరుణ. మహిళ కోటాలో ఆమెకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని చెబుతున్నారు. సామాజికవర్గం పరంగా కాకుండా పార్టీలోనూ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అంతేకాదు మహిళ కోటా కింద ఆమెకు కూడా ఈసారి మోదీ కేబినెట్ లో చోటు దక్కుతుందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. డీకే అరుణ తన ప్రచారంలోనూ తనను ఈసారి గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవితో ఇక్కడకు అడుగుపెడతానని ఆత్మవిశ్వాసంతో చెబుతుండటం ఇందుకు నిదర్శనం. తెలంగాణలో మహిళలకు ఇవ్వదలచుకుంటే మహిళ కోటా కింద డీకే అరుణ పేరు ప్రధమంగా వినిపిస్తుందంటున్నారు.
తాను కూడా రేసులో...
మరో బీసీ కీలక నేత ఈటల రాజేందర్ ఈయన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఈటల కూడా తాను గెలిస్తే కేంద్ర మంత్రిని అవుతానని చెప్పుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే తనను గెలిపించాలని, ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి తనను వరిస్తుందని, బీసీ కోటా తనకు సహకరిస్తుందని చెబుతున్నారట. టీఆర్ఎస్ నుంచి వచ్చినా బీసీలలో ముఖ్యమైన నేతగా ఈటల రాజేందర్ కు పేరుండటంతో ఆయన పేరును కూడా పార్టీ నేతలు ఎవరూ కొట్టి పారేయలేరంటున్నారు. మొత్తం మీద ఈసారి తెలంగాణ బీజేపీలోలో ఇంకా ఎన్నికలు గెలవకముందే మంత్రి పదవులపై చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది. కిషన్ రెడ్డికి మాత్రం ఈసారి చెక్ పెట్టే నేతలు ఎన్నికల బరిలో ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు.
Next Story