Tue Nov 05 2024 16:25:34 GMT+0000 (Coordinated Universal Time)
BJP : వ్యూస్ వచ్చాయని ఓట్లు వచ్చిపడతాయా? పాతబస్తీలో నెగ్గుకు రాగలరా?
తెలంగాణలో అన్ని లోక్సభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గమే
తెలంగాణలో అన్ని లోక్సభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గమే. ఎందుకంటే ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయి. ఒకరు ముస్లింపార్టీకి చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తుండగా, ఆయనపై రూపంలోనూ, భాష్యంలోనూ హిందుత్వాన్ని కనపరుస్తున్న కొంపెల్ల మాధవీలత బీజేపీ నుంచి బరిలోకి దిగుతుంది. కొంపెల్ల మాధవీలత ఎంపికే అనూహ్యంగా జరిగింది. ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలలో కూడా ఆమె ఎక్కడా కనపడలేదు. అసలు పార్టీ సభ్యత్వం ఉందో కూడా తెలీని పరిస్థితుల్లో కొంపెల్ల మాధవీలతను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
కొంపెల్ల మాధవీలత ఎంపిక ఆషామాషీగా జరగలేదు. ఆమె హైదరాబాద్ లో పేరెన్నికగన్న విరంచి ఆసుపత్రి అధినేత సతీమణి. డబ్బుకు కొదవలేదు. మంచి మాటకారి. మొన్నటి వరకూ కొంపెల్ల మాధవీలత అంటే ఎవరికీ తెలియదు. కానీ కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిందుత్వ గురించి ఆమె చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. పక్కా హిందుత్వ వాదిగా ఆమె స్క్రీన్ పై కనపడుతుండటం కూడా కొంత కలసి వచ్చిందనే అంటున్నారు. అందుకే మరో విషయాన్ని ఆలోచించకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం కొంపెల్ల మాధవీలత ను హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్న కామెంట్స్ కూడా పార్టీలోనే వినపడుతున్నాయి.
అసద్ ను ఎదుర్కొనడం..
నిజానికి అసదుద్దీన్ ఒవైసీని పాతబస్తీలో ఎదుర్కొనడం అంత ఆషామాషీ కాదు. 1984 నుంచి 2004 మధ్య ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆరు సార్లు ఎంపీగా అక్కడ గెలిచారు. ఆ తర్వాత 2004 నుంచి నాలుగు ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడ జెండా పాతేశారు. పాతబస్తీలో గెలుపు అంటే అంత సులువు కాదు. ఇప్పటికే పాతబస్తీలో అనేక దొంగ ఓట్లను తొలగించడంలో కొంత వరకూ సక్సెస్ అయ్యారని బీజేపీ వర్గాలు ఒకింత సంతోషంగా ఉన్నాయి. దొంగ ఓట్ల తోనే ఎప్పుడూ గెలుస్తారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ అసద్ భాయ్ ను ఓడించడం అంటే మాటలు కాదు. కానీ కొంపెల్ల మాధవీలత కు తొలి జాబితాలోనే సీటు దక్కడం చర్చనీయాంశంగా మారింది. మాధవీలత పుట్టింది పాతబస్తీలోనైనా ఆమె గెలవగల సత్తా ఉందా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బయట ప్రపంచానికి...
వేషధారణ చూసి ఆమెను తక్కువగా కూడా అంచనా వేయలేం. ఆమె నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు. కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. భరత నాట్య కళాకారిణిగా కూడా గుర్తింపు ఉంది. పాత బస్తీలో అనేక సేవా కార్యక్రమాలను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తూ వెళుతున్నారు. అదే ఆమెకు కలసి వచ్చిందంటున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చాయని ఓట్లు పడతాయా? అంటే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు. కానీ కొంపెల్ల మాధవీలత మాత్రం తాను పోటీలో ఉన్నానని మాత్రం బాహ్య ప్రపంచానికి చెబుతున్నారు. అసద్ ను నిజంగా ఓడించగలిగితే మాధవీ లత రికార్డుకు ఎక్కుతారు. అంతేకాదు దేశంలోనే జెయింట్ కిల్లర్ గా నిలుస్తారనడంలో సందేహం లేదు. కానీ అది సాధ్యం కావడానికి మాత్రం అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి కొంపెల్ల మాధవీలత ఏ మేరకు ఓట్లు సాధిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story