Mon Dec 23 2024 02:16:07 GMT+0000 (Coordinated Universal Time)
TDP : బీజేపీ నేతకు టీడీపీ టిక్కెట్.. చంద్రబాబు ఆయనకు అందుకే ఇచ్చారా?
బాపట్ల నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోటీ జరుగుతుంది. మాజీ డీజీపీ వర్సెస్ సాధారణ నేత ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ అధికార ప్రతినిధికి చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ ను ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన గతంలో డీజీపీగా పనిచేశారు. ఆయనకు ఇక్కడ ఉన్న పరిచయాలు, బంధుత్వాల కారణంగా ఆయనకు టిక్కెట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా నందిగం సురేష్ ను ప్రకటించారు. దీంతో బాపట్లలో ఊర మాస్ vs హై క్లాస్ మధ్య పోటీ జరగనుంది.
బీజేపీ నేతకు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒప్పందం ప్రకారం టీడీపీ పదిహేడు పార్లమెంటు స్థానాల్లోనూ, బీజేపీ ఆరు స్థానాల్లోనూ, జనసేన రెండు స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. ఇందులో పదమూడు పార్లమెంటు నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అందులో బాపట్ల కూడా ఒకటి. అయితే బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి పేరును చూసి బీజేపీ నేతలే అవాక్కయ్యారు. ఆయనకు ఎలా టిక్కెట్ వచ్చిందబ్బా? అని ఆరా తీశారు. అయితే ఏ పార్టీ అయితేనేం కూటమి నుంచే కదా? అది కూడా తమ ఖాతాలోనే పడే అవకాశముంది కదా? అని బీజేపీ నేతలు కూడా సర్దుకున్నారు.
తెలంగాణలో ప్రయత్నించి...
కృష్ణప్రసాద్ ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. లోక్సభ ఎన్నికల్లో వరంగల్ సీటును కూడా ఆయన ఆశించారు. అయితే ఆయనకు టిక్కెట్ రాలేదు. ఆయన తెలంగాణలో బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ఆయన సైకిల్ సింబల్ పై పోటీ చేయనుండటంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే పార్టీ మారకుండానే, కండువా మార్చుకుండానే వేరే పార్టీ దక్కిన ఏకైక అభ్యర్థిగా కృష్ణప్రసాద్ రికార్డు సృష్టించారనే చెప్పాలి. ఇక్కడ ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య జరుగుతుంది. వైసీపీ ఎంపీగా నందిగం సురేష్ పేరును ఆ పార్టీ ప్రకటించింది.
Next Story