Sun Dec 22 2024 10:53:53 GMT+0000 (Coordinated Universal Time)
KCR : పేరు మార్చు సామీ.. ఫేటు మారుతుంది.. ఇంకా లేటు చేసే కొద్దీ సీన్ సితారే?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వత్తిడి పెరుగుతుంది. పార్టీ పేరు మార్చాలంటూ అనేక మంది నేతలు కోరుతున్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వత్తిడి పెరుగుతుంది. పార్టీ పేరు మార్చాలంటూ అనేక మంది నేతలు కోరుతున్నారు. నేరుగా చెప్పకపోయినా వివిధ సందర్భాల్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలంటూ నేతలంతా అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పార్టీ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ కేసీఆర్ మాత్రం ఇగోకు పోతున్నట్లుందని పిస్తుంందని గులాబీ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఒకసారి బీఆర్ఎస్ గా మార్చి మరొక సారి టీఆర్ఎస్ గా మారిస్తే తాను ఓటమిపాలయినట్లు అంగీకరించినట్లవుతుందని పెద్దాయన కొంత ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం.
టీఆర్ఎస్ గా ఉన్ననాళ్లు ఆ పార్టీని ప్రజలు ఓన్ చేసుకున్నారు. తమ ఇంటి పార్టీగా భావించారు. రెండుసార్లు ఆదరించారు. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారో అప్పుడే దాని పతనం ప్రారంభమయిందన్న విశ్లేషణలు వినిపడుతున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఎన్నో వాగ్దానాలు చేసి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లినా మూడోసారి ప్రజలు తమను ఆదరించకపోవడానికి ముఖ్య కారణం బీఆర్ఎస్ అని పేరు అంటూ అనేక మంది చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి సీనియర్ నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ఇక పేరు మార్చేస్తారని అందరూ అనుకున్నారు.
పండితుల సూచన మేరకే...
కానీ కేసీఆర్ మాత్రం ఇగోకు వెళుతున్నారంటున్నారు. ఇప్పుడు పేరు మారిస్తే పేరు మార్చి గత ఎన్నికల్లో ఓటమికి తానే కారణమని భావించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నాడు పండితులు చెబితే ఆయన పేరు మార్చారు. కొందరు పండితులు టీఆర్ఎస్ పేరును మారిస్తే తప్ప మూడోసారి గెలవదని చెప్పడం వల్లనే కేసీఆర్ పేరు మార్చారంటున్నారు. అంతే తప్ప దేశ రాజకీయాల్లో ఉద్ధరిద్దామని పెద్దాయన పేరు మార్చలేదు. కానీ ఇప్పుడు నేతల నుంచి వత్తిడి ఎక్కువగా వస్తుంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లోపు మార్చాలని కొందరు అభ్యర్థులు నిన్నటి సమావేశంలోనూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. నేరుగా కేసీఆర్ తో చెప్పకపోయినప్పటికీ, తమతో కలివిడిగా ఉండే కేటీఆర్, హరీశ్్రావులతో పేరు మార్పిడి విషయాన్ని కొందరు అభ్యర్థులు ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
ఏదైనా ఎన్నికల తర్వాతే...
కేసీఆర్ మాత్రం ఇప్పట్లో పేరు మార్చడానికి అంగీకరించడం లేదంటున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత చూద్దాంలే అని ఒకరిద్దరి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత పేరు మార్పిడిపై దృష్టి పెడతానని ఆయన అన్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలకు మాత్రం బీఆర్ఎస్ పేరుతోనే వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించడంతో ఇక సీనియర్ నేతల నోళ్లు కూడా మూతబడ్డాయి. వచ్చే అసెంబ్లీ నాటికి చూద్దాంలే అన్నట్లు ఆయన వ్యవహారం కనిపిస్తుందంటున్నారు. ఒకవేళ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తే మాత్రం పేరు మార్పు అనేది ఉండకపోవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారుతుందన్న కొందరి నేతల ఆశలకు కేసీఆర్ తాత్కాలికంగా చెక్ పెట్టినట్లు తెలిసింది.
Next Story