Thu Nov 07 2024 05:56:35 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : బాబోయ్ పోలింగ్ సోమవారం వచ్చిందా.. నగరం నిద్రపోయినట్లేగా?.. ఈసారైనా ఓటింగ్ బాగా జరిగేనా?
హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ ఓట్లు పెద్దగా పోల్ కావు. పోలింగ్ డే నాడు సెలవుదినంగా భావించి ఇళ్లలోనే ఉండిపోతారు
హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ ఓట్లు పెద్దగా పోల్ కావు. పోలింగ్ డే నాడు సెలవుదినంగా భావించి ఇళ్లలోనే ఉండిపోతారు నగరవాసులు. గత శాసనసభ ఎన్నికల్లో 48 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. అతి తక్కువ పోలింగ్ శాతం హైదరాబాద్ నగరంలోనే నమోదయింది. ఉద్యోగులు, యువత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోనే అతి తక్కువగా ఓట్లు నమోదు కావడంత రాజకీయనేతలను సయితం నిరాశపర్చింది. అందులో గత శాసనసభ ఎన్నికల్లో ఎండలు లేవు. చల్లగా ఉన్నా సరే పోలింగ్ కేంద్రాల వైపు కూడా తొంగి చూడలేదు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు కూడా పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఇంటివద్దనే గడిపారు.
అయితే ఈసారి మే 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఎండలు మండే కాలమది. గత అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లో జరిగినా నగరవాసులు పత్తా లేరు. అందుకే ఈసారి ఓట్ల శాతంపైన కూడా అనుమానాలు అనేకం ఉన్నాయి. అసలు పోలింగ్ కేంద్రాలకు జనం ఈ ఎన్నికలకు వస్తారా? అన్నది కూడా అనుమానంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ప్రతి ఇంటికి తిరిగి అభ్యర్థులు ఓట్లను అభ్యర్థించారు. ఇంటింటికీ స్లిప్పులను పంపిణీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు కావడంతో అసెంబ్లీ అంత సీరియస్ గా అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం చేయలేరు. పార్లమెంటు పరిధి ఎక్కువ కావడంతో అది సాధ్యం కాదు. అందుకే ఈ ఎన్నికలపై పెద్దగా జనాలకు ఆసక్తి కూడా తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వినపడుతుంది.
మూడు రోజులు సెలవులు...
పోలింగ్ రోజు సెలవు కావడంతో అందరూ సొంతూళ్లకు వెళ్లిపోయారు. అందులోనూ మే 13వ తేదీ సోమవారం వచ్చింది. ఇప్పుడు రాజకీయ నాయకులకు అదే దడ పట్టుకుంది. సోమవారం సెలవు కావడంతో పాటు వరసగా శని, ఆదివారాలు కూడా సెలవులు కావడంతో ఇక పోలింగ్ కేంద్రానికి వస్తారన్న నమ్మకం లేదంటున్నారు పార్టీల అభ్యర్థులు. ఎక్కువ మంది సాఫ్ట్్వేర్ ఇంజినీర్లు కావడంతో వరసగా మూడు రోజులు సెలవు దినాలు రావడంతో ఎంజాయ్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు తప్పించి ఓటు వేయడానికి వస్తారా? అన్న అనుమానాలు మాత్రం అధికారులను సయితం పీడిస్తుంది.
హాలిడే ట్రిప్ లకే...
శని, ఆది, సోమ వారాలు సెలవుదినాలు కావడంతోనే అసలు సమస్య వచ్చింది. సెలవు రోజుల్లో సొంతూళ్లకు పోయే వాళ్లు కొందరైతే హాలిడే ట్రిప్ లు వేస్తారన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మండే ఎన్నిక రావడం ఎవరి కొంప ముంచుతుందోనన్న అనుమానం మాత్రం అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఎన్నికల అధికారులు పోలింగ్ శాతాన్ని పెంచడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు అన్ని రకాలుగా అధికారులయితే ప్రయత్నిస్తున్నారు. కానీ యువతను పోలింగ్ కేంద్రాలకు తీసుకు వస్తారా? లేదా? అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. ఓటు హక్కు మన బాధ్యత అని తెలుసుకుని వారంతట వారు వస్తే సరి. లేకుంటే గత ఎన్నికల చరిత్ర పునరావృతం కాకమానదు.
Next Story