Mon Dec 16 2024 22:08:41 GMT+0000 (Coordinated Universal Time)
2024 Elections India : బీజేపీకి జేజేలు - కాంగ్రెస్ కు కన్నీళ్లు
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ఇండి కూటమి పార్టీలకు చేదు అనుభవం మిగల్చగా, బీజేపీకి అత్యధిక చోట్ల విజయం దక్కింది
భారత్ లో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ఇండి కూటమి పార్టీలకు చేదు అనుభవం మిగల్చగా, బీజేపీ మిత్రపక్షాలు అత్యధిక చోట్ల విజయం సాధించినట్లయింది. 2024 లోక్ సభ ఎన్నికల నుంచి అనేక రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ కూటమి పార్టీలు తమ సత్తాను చాటాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పదిహేనేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. మోదీ హవాయే దేశంలో నడుస్తుందని 2024 ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలను చేపట్టడం కూడా రికార్డుగానే అనుకోవాలి.
మోదీ అంతా తానే అయి...
మోదీ అంతా తానే అయి ప్రచారం నిర్వహించిన ఈ దేశంలో ఎన్నికలకు ప్రజలు కమలం పార్టీకి ముచ్చటగా మూడోసారి జై కొట్టారు. నిజంగా బీజేపీకి ఇది పార్టీ చరిత్రలోనే అద్భుతమైన రికార్డు. అలాగే కాంగ్రెస్ పతనం కూడా అదే తరహాలో కనిపించింది. మోదీ గ్యారంటీ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇండి కూటమిగా ఏర్పడి దేశంలో అనేక పార్టీలను కలుపుకుని ఎన్నికల్లో ముందుకు సాగింది. రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. అయినా సరే..ఆ పార్టీని ప్రజలు ఆదరించలేకపోయారు. కాంగ్రెస్ వరసగా మూడు దఫాలు అధికారానికి దూరంగా ఉండటంతో క్యాడర్ లో కూడా ఒకరకమైన నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి. అయినా సరే.. జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఈసారి లోక్ సభలో అత్యధిక స్థానాలను సాధించి ప్రతిపక్ష హోదాను సాధించడం విశేషం.
మెజారిటీ స్థానాలకు దగ్గరగా...
543 స్థానాకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయజనతా పార్టీ కూటమికి 293 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి మిత్ర పక్షాల మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా బీహార్ లోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో మూడో సారి కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. బీహార్, ఏపీ ముఖ్యమంత్రులు ఇద్దరూ ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారారు. 2014, 2019 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీ 2024 ఎన్నికల్లో మాత్రం 240 స్థానాలకే పరిమితమయింది. ఇండియా కూటమి 234 స్థానాలను సాధించి గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ ఒక్కటే 99 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది.
ఒడిశాలో తొలిసారి...
అయితే ఇదే ఏడాది జరిగిన ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ గెలిచింది. అదే జమ్మూ కాశ్మీర్ లో ఇండి కూటమి విజయం సాధించింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించింది. జార్ఖంఢ్ లో మాత్రం జేఎంఎం కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే 2024లో ఈవీఎంలపై చర్చ ప్రారంభమయింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూటమి గెలవగా, ఒడిశాలో దశాబ్దాల నాటి నవీన్ పట్నాయక్ హవాకు గండికొట్టి కమలం పార్టీ జెండా ఎగురవేయగలిగింది. ఈ 2024 ఎన్నికల ప్రత్యేకత అదేనని చెప్పుకోవాలి. తొలిసారి ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం మీద 2024లో జరిగిన ఎన్నికలు బీజేపీ కూటమికి ఆనందం మిగల్చగా, కాంగ్రెస్ కు మాత్రం కన్నీళ్లు మిగిల్చాయి.
Next Story