Mon Dec 23 2024 15:04:18 GMT+0000 (Coordinated Universal Time)
గతేడాదికంటే ఈ ఏడాది ఏపీలో తగ్గిన క్రైం రేటు : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
దొంగతనాల కేసులు గతేడాది మాదిరిగానే ఉన్నాయని తెలిపారు. 2020లో 3384కేసులు నమోదు కాగా, 2021 లో 4093, 2022లో 4242 కేసులు..
ఆంధ్రప్రదేశ్ లో గతేడాది కంటే ఈ ఏడాది క్రైం రేటు తగ్గిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. 2021 కంటే.. 2022లో 60 వేల కేసులు తక్కువ నమోదయ్యాయని తెలిపారు. 2021లో 2,84,753 కేసులు నమోదవ్వగా.. 2022లో 2,31,359 కేసులు నమోదైనట్లు వివరించారు. వీటిలో హత్య కేసులు 945 నుండి 857కి తగ్గాయని డీజీపీ పేర్కొన్నారు. అలాగే 169 పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల విషయానికొస్తే.. ఎక్కువగా టూ వీలర్ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 50-60 శాతం ప్రమాదాలు టూ వీలర్ల వల్లే జరుగుతున్నట్లు చెప్పారు.
మహిళలపై పెరిగిన నేరాలు..
2021లో 19,200 రోడ్డుప్రమాదాల కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది ఆ కేసుల సంఖ్య 18,739కి తగ్గిందన్నారు. అలాగే మృతుల సంఖ్య కూడా 7,430 నుండి 6,800కి తగ్గిందని డీజీపీ వివరించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే స్పాట్ లను గుర్తించామని, ప్రమాదాలను నివారించేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ రాజేంద్రనాథ్ వెల్లడించారు. టూ వీలర్స్ నడిపే వారు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ ఏడాది పెండింగ్ కేసుల సంఖ్య చాలా వరకూ తగ్గిందన్న డీజీపీ.. లోక్ అదాలత్ లో 57 వేల కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మహిళలపై హత్యలు, అత్యాచారాల కేసుల్లో 44 మందికి శిక్షపడిందని, 88.5 శాతం కేసుల్లో చార్జిషీట్లు వేశామని తెలిపారు. దిశ యాప్ ను 11,79,985 మంది డౌన్లోడ్లు చేసుకోగా 4,97,432 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 2524 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసినట్లు డీజీపీ వివరించారు.
దొంగతనాల కేసులు గతేడాది మాదిరిగానే ఉన్నాయని తెలిపారు. 2020లో 3384కేసులు నమోదు కాగా, 2021 లో 4093, 2022లో 4242 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాది టెక్నాలజీ ఆధారంగా.. నేరస్తుల గుర్తింపు, దొంగతనం చేయబడిన నగదు, బంగారాలను రికవరీ చేయడం సులభతరమైందన్నారు. ఈ ఏడాది సైబర్ నేరాల సంఖ్య పెరిగిందన్నారు. గతేడాది 2039 సైబర్ కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 2783కి పెరిగిందన్నారు. వీటిలో ఎక్కువగా.. ఆన్లైన్ లోన్ యాప్ ల కారణంగా మోసపోయిన కేసులే ఉన్నాయన్నారు.
నాటుసారా, గంజాయి సాగును కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది 100 గ్రామాల్లో నాటుసారా తయారీని అడ్డుకున్నామని, 600 ఎకరాల్లో గంజాయి సాగుని దహనం చేసామని వివరించారు. అలాగే 2.45 లక్షల గంజాయి సరఫరాను గుర్తించి సీజ్ చేసి దహనం చేశామన్నారు. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై అందించామన్నారుు. శాటిలైట్ ఫొటోస్ ద్వారా ఎప్పటికప్పుడు గంజాయి సాగుపై దృష్టిసారిస్తున్నామని డీజీపీ రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.
Next Story