Thu Dec 26 2024 21:00:48 GMT+0000 (Coordinated Universal Time)
Maharashtra Elections : క్యాంప్ రాజకీయాలకు కేరాఫ్ హైదరాబాద్, కర్ణాటక
మహారాష్ట్ర ఎన్నికల్లో కౌంటింగ్ ప్రారంభమయిన తర్వాత రెండు కూటముల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో కౌంటింగ్ ప్రారంభమయిన తర్వాత రెండు కూటముల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయింది. అయితే మహారాష్ట్రలో మహాయుత కూటమి, మహా వికాస్ అఘాడీ కూటమి నువ్వా? నేనా అన్నట్లు పోరు కనపడుతుంది. అయితే మొదటి రౌండ్ కావడంతో ఇప్పుడే అంచనా వేయలేకపోయినా 138 స్థానాల్లో మహాయుత కూటమి, 136 స్థానాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మరో పది మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. పది మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
హైదరాబాద్ లోనూ...
అయితే కాంగ్రెస్ అభ్యర్థులను హైదరాబాద్ కు క్యాంప్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ కూటమి నుంచి గెలిచిన అభ్యర్థులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించే అవకాశముందని తెలిసింది. ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లను ముందుగానే బుక్ చేసినట్లు తెలిసింది. తాజ్ డెక్కన్, తాజ్ బంజారాతో పాటు మరికొన్ని స్టార్ హోటళ్లను ముుందుగానే బుక్ చేయడంతో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను హైదరాబాద్ కు తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 72 గంటల సమయం మాత్రమే ఉండటంతో క్యాంప్ రాజకీయాలు ప్రారంభమవుతాయని అంటున్నారు.
బెంగళూరులోనూ...
అదే సమయంలో కాంగ్రెస్ కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో తమ కూటమి నుంచి గెలుపొందిన వారిని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు తరలించేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న కొన్ని స్టార్ హోటళ్లతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్ లను ముందుగానే కాంగ్రెస్ నేతలు బుక్ చేసినట్లు తెలిసింది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో రెండు రాష్ట్రాల్లో ముందుగానే హోటల్స్ ను బుక్ చేశారు. మరోవైపు బీజేపీ కూడా క్యాంప్ రాజకీయాలకు సిద్ధమవుతుంది. ఇలా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు క్యాంప్ రాజకీయాలకు రెడీ అయినట్లే కనిపిస్తున్నాయి. పరిశీలకులు ఇప్పటికే స్థానిక నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
Next Story