Thu Dec 26 2024 21:16:08 GMT+0000 (Coordinated Universal Time)
Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయనిస్తుంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయనిస్తుంది. ఇంతటి భారీ విజయాన్ని ఆపార్టీ నేతలు కూడా బహుశ ఊహించి ఉండరు. మరాఠా ప్రాంతంలో శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేల ప్రాధాన్యతను ఎవరూ తోసిపారేయలేరు. ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి దించారన్న సానుభూతి పనిచేస్తుందని కాంగ్రెస్ కూటమి అంచనా వేసింది. అయితే అక్కడ మాత్రం కాంగ్రెస్ కూటమి ప్లాన్ రివర్స్ అయింది. బీజేపీ 90 శాతం స్ట్రయికింగ్ రేటును సాధించే దిశగా ప్రయాణం చేస్తుంది. దీంతో బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజలు ఎటూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఓటేశారా? లేక అభివృద్ధి, సంక్షేమానికి జై కొట్టారా? అన్న డైలమాలో రాజకీయ నేతలున్నారు.
పార్టీని చీల్చినా...?
మహారాష్ట్రలో ఉన్న 288 అసెంబ్లీ స్థానాల్లో 222 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా పయనిస్తుందంటే దీనికి కారణాలపై బీజేపీయేతర పార్టీలు విశ్లేషించుకోవాల్సి ఉంది. నిజానికి శివసేన పార్టీని చీల్చి ఏక్ నాధ్ షిండే శివసేన తన వర్గంగా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వేరు కుంపటి పెట్టుకుని బీజేపీ కూటమి వైపు నిలిచారు. అయినా సరే ప్రజలు మరోసారి ఈ కూటమికే అధికారాన్ని కట్టబెట్టారంటే పార్టీని చీల్చినా మరాఠా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతుంది. దళిత, మరాఠా, కుంబీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి తిరుగులేని విజయం లభించడంతో ఇంత పెద్ద స్థాయిలో స్థానాలు దక్కాయని చెప్పాలి.
కులాల వారీగా...
ఎన్నికల హామీలను కూడా పెద్దగా మరాఠా ప్రజలు పట్టించుకోలేదని అర్థమవుతుంది. ఇండి కూటమి గ్యారంటీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఎక్కువ మంది ప్రజలు మహాయుత కూటమి వైపు మాత్రమే మొగ్గు చూపారు. ఎలాంటి సెంటిమెంట్ పనిచేయలేదు. బీజేపీ 23 శాతం ఓటు షేర్ సాధించింది. ఏకనాధ్ షిండే శివసేన 13 శాతం ఓట్ షేర్ సాధించింది. అజిత్ పవార్ పార్టీ 10 శాతం ఓట్లను సాధించింది. పక్కా హిందుత్వ పార్టీగా ఉన్న శివసేనను కూడా ఈసారి ప్రజలు విశ్వసించలేదు. కులాలు ఈసారి ఈ ఎన్నికల్లో కీలక భూమికను పోషించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని పట్టణ ఓటర్లు భావించినట్లు కనపడుతుంది.
ఇచ్చిన హామీలు...
దీంతో పాటు మహాయుత కూటమి ఇచ్చిన హామీలు కూడా బలంగా పనిచేశాయి. మరాఠా, మహిళా, యువత, ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నాలు ఫలించాయి. మహిళలకు నెలకు 2,100 రూపాయలు ఇస్తామని చేసిన ప్రకటన కూడా కలసి వచ్చింది. ఓబీసీ ప్రచారం కూడా ఎన్నికల్లో కలసి వచ్చిందనే చెప్పాలి. తాము అధికారంలోకి వస్తే పది లక్షల మంది విద్యార్థులకు నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ కూడా బలంగా పనిచేసింది. రైతులకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పింది. దీంతో పాటు కులగణన వల్ల నష్టమని మోదీ చేసిన ప్రచారం కూడా మహారాష్ట్రలోని ఓబీసీలలో బలంగా పనిచేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద అనేక కారణాలు మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత గెలుపునకు కారణమని చెప్పక తప్పదు.
Next Story