మళ్లీ పట్టాలెక్కనున్న మర్మయోగి
లోకనాయకుడు కమల్ హాసన్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో, ఎందరో దర్శక దిగ్గజాల చిత్రాలలో పని చేసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్ నిర్దేశించుకుని ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ వినూత్న మార్గంలో ప్రయాణం సాగిస్తుంటాడు. అటువంటి అనేక ప్రయత్నాల్లో ఆయన ప్రతిభ ప్రపంచానికి మరో సారి తెలియజేసే కథ అని అందరూ నమ్మిన మర్మయోగి. అయితే ఈ చిత్ర ట్రైలర్ చిత్రీకరణకే దాదాపు 9 కోట్ల రూపాయలు వెచ్చించిన కమల్ హాసన్ 30 శాతం చిత్రీకరణ జరిపిన తరువాత బడ్జెట్ సర్దుబాటులో ఎదురైనా అవకతవకలను అధిగమించలేక చిత్రీకరణను నిలిపి వేసాడు. కానీ కమల్ హాసన్ మర్మ యోగి గురించి మాట్లాడిన ప్రతి సారి ఆ చిత్రంపై తన ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్తూనే వున్నాడు.
ఇంత కాలానికి మళ్లీ మర్మయోగి చిత్రీకరణ తిరిగి ప్రారంభించటానికి కావాల్సిన నిధులు సమకూర్చగల అభిరుచిగల నిర్మాణ భాగస్వాములు కమల్ హాసన్ కు తారస పడ్డారు. లండన్ లో వున్న కమల్ హాసన్ స్నేహితుడు ఒకరు వన్ ఆఫ్ ది ఫండర్స్ గా ఉండగా మిగిలిన మొత్తం పలువురు వ్యక్తుల వద్ద నుంచి కాక ఒక నిర్మాణ సంస్థ నుంచి సేకరించగలిగితే నాణ్యమైన చిత్రం తెరకెక్కటానికి చేయూత గా ఉంటుంది అనే ఆలోచనతో కమల్ హాసన్ తన స్నేహితుడితో కలిసి లండన్లో లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ను కలిసి మర్మ యోగి చిత్రీకరణ ఎంత వరకు జరిగింది, ఇంకా ఎన్ని రోజుల చిత్రీకరణ మిగిలి వున్నది, ఎంత వ్యయం ఖర్చు చెయ్యాల్సి వుంది, ఏ ప్రాంతాలలో చిత్రీకరణ జరపాల్సి వుంది, బుక్ చేయవలసిన నటీనటులు సాంకేతిక నిపుణుల కాల్ షీట్స్ వంటి అన్ని అంశాలతో కూడిన ఒక ప్రెసెంటేటషన్ చేయగా సుభాస్కరన్ పాజిటివ్ గా స్పందించినట్టు సమాచారం.
ప్రస్తుతం శంకర్-రజని కాంత్ల క్రేజీ ప్రాజెక్ట్ 2 .o చిత్రాన్ని హేండిల్ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఆ చిత్రం అనంతరం మర్మ యోగి చిత్రీకరణకు తమ సహకారం అందించే అవకాశాలు వున్నాయి. ఇప్పటికైనా అన్ని సక్రమంగా జరిగితే 2019 ప్రథమార్ధంలో మర్మయోగి విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి.
- Tags
- kamal