Mon Dec 23 2024 10:43:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్.. ఇండియా తరపున 5 చిత్రాలు
ఆస్కార్ షార్ట్ లిస్టులో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కింది. అలాగే కాంతారా, గంగూబాయ్ కతియావాడి, విక్రాంత్ రోణ..
95వ ఆస్కార్ నామినేషన్స్ షార్ట్ లిస్ట్ వచ్చేసింది. తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న తరుణమిది. అందరూ అనుకున్నట్టే.. ఆస్కార్ షార్ట్ లిస్టులో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కింది. అలాగే కాంతారా, గంగూబాయ్ కతియావాడి, విక్రాంత్ రోణ, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. రెండు కన్నడ, రెండు హిందీ, ఒక తెలుగు సినిమాలు భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలిచాయి.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. 2022లో అధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీసిన ఈ సినిమా ఆస్కార్ బరిలో ఇండియన్ ఫిల్మ్ షార్ట్ లిస్ట్ లో బెస్ట్ ఒరిజినర్ స్కోర్ విభాగంలో నామినేట్ అయింది. కీరవాణి సంగీతం అందించిన నాటు నాటు సాంగ్ ఇందుకు ఎంపికైంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాట తెలుగు సహా.. పాన్ ఇండియా భాషల్లో సంచలనం సృష్టించింది. ఈ పాట ఆర్ఆర్ఆర్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచి గెలుస్తుందా లేదా అనేది చూడాలి.
ఆస్కార్ నామినేషన్స్ కు షార్ట్ లిస్ట్ లో ఉన్న మరో సినిమా కాంతారా. అటు దర్శకుడిగా, ఇటు హీరోగా రిషబ్ శెట్టి తీసిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా పాన్ ఇండియా సినిమాగా విడుదలై.. ఎవరూ ఊహించని రీతిలో భారీ వసూళ్లు రాబట్టింది. ఉత్తమ నటుడు కేటగిరీలో కాంతారా ఆస్కార్ నామినేషన్స్ కు షార్ట్ లిస్ట్ లో ఉంది. ఈ సినిమా రిషబ్ కు ఆస్కార్ అవార్డు తెచ్చిపెచుతుందో లేదో వేచిచూడాల్సిందే. అలాగే విక్రాంత్ రోణ, గంగూభాయ్ కతియావాడి, ది కశ్మీరీ ఫైల్స్ వివిధ విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలిచాయి. మొత్తం 301 సినిమాలు ఫీచర్ ఫిల్మ్ ఆస్కార్ నామినేషన్ కు అర్హత సాధించనట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ 301 సినిమాలకి జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనున్నాయి. మార్చి 12వ తేదీ ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.
Next Story