Mon Dec 23 2024 09:28:50 GMT+0000 (Coordinated Universal Time)
Acharya Review : ఆచార్య రివ్యూ
మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మెగా కాంబో మూవీ ఆచార్య భారీ అంచనాల నడుమ 29.04.2022న విడుదలైంది. సినిమా షూటింగ్
సినిమా - ఆచార్య
నటీనటులు - చిరంజీవి, రామ్ చరణ్, తనికెళ్ల భరణి, పూజా హెగ్డే, అజయ్, సోనూసూద్, సంగీత, జిషు సేన్ గుప్త తదితరులు
సంగీతం - మణిశర్మ
సినిమాట్రోగ్రఫీ - తిరు
ఎడిటింగ్ - నవీన్ నూలి
నిర్మాత - నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
రచన, దర్శకత్వం - కొరటాల శివ
విడుదల తేదీ - 29.04.2022
మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మెగా కాంబో మూవీ ఆచార్య భారీ అంచనాల నడుమ 29.04.2022న విడుదలైంది. సినిమా షూటింగ్ ప్రారంభానికి ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి భారీ అంచనాలు మొదలయ్యాయి. కానీ.. కరోనా తెచ్చిన కష్టాలతో చాలా రోజులు సెట్స్ కే పరిమితమైందీ సినిమా. తండ్రి- తనయుడు కలిసి నటించడంతో ఆచార్యపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. మరి దర్శకుడు కొరటాల ఈ సినిమాను అభిమానుల అంచనాలకు తగ్గట్టే తీర్చి దిద్దాడా ? చిరు-చరణ్ కలిసి తెరపై చేసిన సందడి ఏంటి ? ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
800 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ టౌన్ ధర్మస్థలి. దాని పక్కనే జీవధార నది. దానికి అటువైపు పాదఘట్టం అనే చిన్న తండా. ధర్మానికి.. ఆయుర్వేద వైద్యానికి ధర్మస్థలి ప్రసిద్ధి. అక్కడ అధర్మం జరిగినప్పుడల్లా అమ్మావారే ఏదొక రూపంలో వచ్చి ధర్మాన్ని నిలబెడుతుందని అక్కడి ప్రజల నమ్మకం. పాదఘట్టం, దానిపక్కన ఉన్న సిద్ధవనంపై కొందరు అక్రమార్కుల కన్ను పడుతుంది. ధర్మస్థలి మున్సిపల్ చైర్మన్ బసవన్న(సోనూసూద్) చాలా క్రూరుడు. ధర్మస్థలి టెంపుల్లో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ.. అక్కడి సొమ్మునంతా కాజేస్తాడు. తన రాజకీయ ఎదుగుదల కోసం ధర్మస్థలి అమ్మవారి ఆలయంతో పాటు.. పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ (జిషు సేన్ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు.
పాదఘట్టం జనాలను, ధర్మస్థలిని కాపాడేవారే లేరా అనుకుంటున్న సమయంలో కామ్రేడ్ ఆచార్య(చిరంజీవి) రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఆచార్య ఎవరు ? అక్కడికి ఎవరు పంపారు ? సిద్ధ (రామ్ చరణ్)కు , ఆచార్యకు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది ?
కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్ సాధించిన కొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. 'మిర్చి' మొదలు..' భరత్ అనే నేను'వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అలాంటి హిట్ దర్శకుడు మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ల కాంబోలో సినిమా తీస్తున్నారంటే.. ఏదో కొత్తదనాన్ని ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ఆచార్య విషయానికొచ్చేసరికి కొరటాల మెగాస్టార్ స్టార్ డమ్ నే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది.
ప్రేక్షకులకు పాత కథే చూపించాడు. అది కూడా అంతగా ఆసక్తిగా సాగలేదు. కాలం చెల్లిన కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఒకానొక దశలో అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి కలగక మానదు. సినిమాలో కొరటాల మార్క్ ఎక్కడా కనిపించదు. టెంపుల్ టౌన్ ఒక్కటే కాస్త కొత్తదనాన్ని కలిగిస్తుంది. ఒకదశ తర్వాత అదికూడా పాతబడిపోతుంది.
మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తో ధర్మస్థలి నేపథ్యాన్ని చెప్పించి కథను ప్రారంభించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ముందు సిద్ధ పాత్ర ఎంటర్ అవుతుంది. దీంతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి పెరుగుతుంది. కానీ అక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాడు కొరటాల. ఆచార్య, సిద్ధ మధ్య వచ్చే సీన్స్ మినహా మిగతాదంతా సింపుల్‌గా సాగుతుంది. నీలాంబరి పాత్రలో కనిపించే పూజా హెగ్డే.. సిద్ధను ప్రేమించే అమ్మాయిగా మాత్రమే కనిపిస్తుంది తప్ప.. కథతో ఆమెకు సంబంధం ఉన్నట్లు అనిపించదు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా, పాత సినిమాల మాదిరి ఉంటుంది. 'లాహే లాహే' 'భలే భలే బంజారా' సాంగ్‌కి రామ్ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారు ?
పాత్ర ఏదైనా.. నటించడం కంటే.. జీవించడం చిరంజీవి ప్రత్యేకత. ఆచార్య సినిమాలో కూడా ఆచార్యగా తనదైన నటనతో చిరంజీవి అదరగొట్టేశాడు. సినిమా ఫస్టాఫ్ అంతా చిరంజీవి నడిపించగా.. సెకండాఫ్ లో సింహభాగం సిద్ధ పాత్రదే. సిద్ధని ప్రేమించే యువతి, సంగీతం టీచర్ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింది పూజాహెగ్డే. కాకపోతే సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. విలన్‌గా సోనూసూద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్‌గా జిషు సేన్ గుప్తా, పాదఘట్టంలోని ఆయుర్వేద వైద్యుడు వేదగా అజయ్ చక్కటి నటనను కనబరిచారు. కామ్రేడ్ శంకర్ అన్నగా సత్యదేవ్ చాలా బాగా నటించాడు. నాజర్ తో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
చిరంజీవి, రామ్ చరణ్ పాత్రలు
ధర్మస్థలి నేపథ్యం
అభిమానుల్ని అలరించే పాటు
మైనస్ పాయింట్స్
కథ, కథనం
భావోద్వేగాలు అంతగా పండకపోవడం
చివరిగా.. ఆచార్య ఒక గుణపాఠం
Next Story