Tue Apr 01 2025 08:00:16 GMT+0000 (Coordinated Universal Time)
నటుడు బ్రహ్మాజీ ఆవేదనను పట్టించుకుంటారా?
సమయానికి వస్తాడు, నవ్వుకుంటూ వెళతాడనే

తెలుగు సినిమాల్లో ఇటీవలి కాలంలో ఇతర భాషల నటులు చాలా ఎక్కువ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఉన్న టాలీవుడ్ చిత్ర దర్శక నిర్మాతలు ఇతర భాషల నటీనటులను తీసుకుంటే ఆయా రాష్ట్రాల్లో మంచి హైప్ వస్తుందని ఆశిస్తూ ఉంటారు. అయితే తెలుగు నటీనటులకు తక్కువ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులలో చాలా మంది ఇతర భాషలకు సంబంధించిన వాళ్లే ఉండడాన్ని ఇప్పటికే చాలా మంది తప్పుబట్టారు. తాజాగా నటుడు బ్రహ్మాజీ కూడా తన ఆవేదనను బయటపెట్టారు.
ఈ మధ్య కాలంలో తాను ఒక తెలుగు సినిమా చూశానని, ఆ సినిమాలో తెలుగువాళ్లను వెతుక్కోవలసి వచ్చిందన్నారు బ్రహ్మాజీ. హీరోతో పాటు ముఖ్యమైన పాత్రలను తమిళ, మలయాళ, హిందీ ఆర్టిస్టులతో చేయించారని బ్రహ్మాజీ తెలిపారు. చిన్నచిన్న పాత్రలను మాత్రమే తెలుగువాళ్లతో చేయించారన్నారు. అది చాలా బాధను కలిగించిందని, అలాంటప్పుడు ఆ సినిమాను వేరే భాషలో తీసి ఇక్కడ డబ్ చేసుకోవచ్చు కదా అని అన్నారు. తెలుగువాళ్లకి అవకాశాలు దక్కాలని తాను కోరుతున్నానన్నారు బ్రహ్మాజీ. హీరోను కావాలని ఇండస్ట్రీకి రాలేదని, అందువలన నా కెరియర్ విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సమయానికి వస్తాడు, నవ్వుకుంటూ వెళతాడనే ఒక మార్క్ కారణంగానే ఇంతకాలం పాటు తాను ఇండస్ట్రీలో ఉండగలిగానని బ్రహ్మాజీ తెలిపారు. దర్శక నిర్మాతలు కూడా తనను గౌరవిస్తూనే వర్క్ చేయించుకున్నారని తెలిపారు బ్రహ్మాజీ.
Next Story