Mon Dec 23 2024 09:20:01 GMT+0000 (Coordinated Universal Time)
కరీనా కపూర్ కు కోవిడ్ పాజిటివ్
కరీనా కపూర్ తో పాటు ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు సమాచారం
చూడబోతే కరోనా వైరస్ కొంతకాలంగా తనకుపట్టిన బద్దకాన్ని వదిలి.. మళ్లీ విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. హమ్మయ్య.. కరోనా కాస్త తగ్గుముఖం పడుతోంది. ఇక పూర్తిగా తగ్గిపోతుందిలే. వ్యాక్సిన్లు కూడా వచ్చాయిగా.. అనుకునేలోపే ఉగ్రరూపంతో రెచ్చిపోతోంది. ఇలా రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. 2020 లో వరుసగా సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇటీవలే కమల్ హాసన్ యూఎస్ ట్రిప్ అనంతరం కరోనా బారిన పడి.. కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత కడప కి వెళ్లొచ్చిన అనంతరం కాస్త అస్వస్థతకు గురవ్వడంతో .. ఏఐజీ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకుంది. ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉండగానే.. ఇటు బాలీవుడ్ లో కరీనా కపూర్ ఖాన్ కి కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా నిబంధనలకు విరుద్ధంగా...
కరీనా కపూర్ తో పాటు ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇలా ఆదేశించింది. " ఇటీవలే వీరిద్దరూ కరోనా నిబంధనలకు అతీతంగా అనేక పార్టీలకు హాజరయ్యారు. ఇటీవల కాలంలో కరీనా, అమృతా అరోరాలను కలిసిన వారంతా వెంటనే RT-PCR పరీక్ష చేయించుకోవాలి" అని ఆదేశాలు జారీ చేసింది ముంబై కార్పొరేషన్. సెలబ్రిటీలే ఇలా నిబంధనలకు నీళ్లొదిలి కరోనా బారిన పడుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు. ఇలాగైతే కరోనా మళ్లీ అందరినీ చుట్టేయడానికి ఎక్కువకాలం పట్టేలా లేదంటూ ఇంకొందరు అంటున్నారు.
Next Story