Mon Dec 23 2024 05:27:18 GMT+0000 (Coordinated Universal Time)
RRRలో సీత పాత్ర అలా వచ్చింది : అలియా భట్
ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తుందేమోనన్న చిన్న ఆశతో ఆయనతో మాట్లాడేందుకు దగ్గరకు వెళ్లిందట.
RRR.. ఇప్పుడీ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. దర్శకుడు రాజమౌళి ప్రీ ఇండిపెండెన్స్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయడంతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో కనిపించి.. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వీరికి జంటగా అలియా భట్, ఒలీవియా మోరిస్ లు నటించారు.
తాజాగా.. అలియాభట్ ఓ ఇంటర్వ్యూలో తాను RRR సినిమాలో సీత పాత్రకి ఎలా ఎంపికైందీ చెప్పింది. బాహుబలి తర్వాత రాజమౌళిని అలియాభట్ ఒక ఎయిర్ పోర్టులో చూసిందట. ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తుందేమోనన్న చిన్న ఆశతో ఆయనతో మాట్లాడేందుకు దగ్గరకు వెళ్లిందట. రాజమౌళికి తనని తాను పరిచయం చేసుకుని మాటల్లో మాటగా మీతో కలిసి పనిచేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. ఆ మాటలు పూర్తవగానే రాజమౌళి.. ఆల్రెడీ నేను నీ కోసం ఒక పాత్ర రాసుకున్నా, త్వరలో నేనే నిన్ను సంప్రదించాలని అనుకుంటున్నా అని చెప్పాడట. ఆ తర్వాత కొన్నాళ్లకి రాజమౌళి RRR తో అలియాని సంప్రదించడం, ఆమె ఆ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సీతగా అలియా ఎలా నటించిందో అందరికీ తెలిసిందే.
ఇకపోతే.. మరికొద్దిగంటల్లో ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభం కానుంది. RRRలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు దక్కుతుందన్న ఆశతో.. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు రాజమౌళి, కీరవాణి, సెంథిల్, ఎన్టీఆర్, రామ్ చరణ్, సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తదితరులు ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను రాహుల్, కాలభైరవ లైవ్ లో పాడనున్నారు.
Next Story