అల్లు అర్జున్ – అట్లీ కలయికలో అద్భుత విజన్… ప్రపంచాంతర చిత్రానికి శ్రీకారం!
అల్లూ అర్జున్-అట్లీ కలయికలో బియాండ్ ది వరల్డ్ కాన్సెప్ట్‌తో AA22xA6 సినిమా… సూపర్‌నేచురల్ థ్రిల్‌కు శ్రీకారం చుట్టారు.

పుష్ప 2: ది రూల్‌తో చరిత్ర సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన జన్మదినం సందర్భంగా మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈసారి సూపర్‌హిట్ డైరెక్టర్ అట్లీతో కలసి ఓ విభిన్నమైన విజన్‌తో రూపొందనున్న సినిమా AA22xA6గా ప్రకటించారు. ఇది అల్లూ అర్జున్‌కి 22వ సినిమా కాగా, అట్లీకి 6వ దర్శక ప్రాజెక్ట్ అవుతుంది. ఈ అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల్లో అమితమైన ఉత్సాహం నెలకొంది.
సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. అందులో ఈ చిత్ర ప్రయాణం ఎలా మొదలైందో, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో భాగమైన VFX అభివృద్ధి దశలు చూపించారు. ఇండియా, అమెరికాలోని ప్రముఖ స్టూడియోలతో ఈ ప్రాజెక్ట్ జరుగుతోంది. ముఖ్యంగా లోలా VFX స్టూడియో ప్రముఖ కళాకారులు ఈ కథను చదివి ఎంతో ఎగ్జయిట్ అయ్యారు.
ఈ వీడియోలో అల్లు అర్జున్‌కు 360 డిగ్రీ 3D స్కానింగ్ జరుగుతున్న సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది సినిమాలో ఉండబోయే విజువల్ గ్రాండియర్‌కి నిదర్శనంగా మారింది. సినిమాలో సూపర్‌నేచురల్, ఎలియన్ ఎలిమెంట్లు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ‘బియాండ్ ది వరల్డ్’ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్నదిగా తెలిపారు.
త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి స్టార్ కాస్ట్ త్వరలోనే వెల్లడించనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ సినిమా ద్వారా సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ గ్రాండ్ విజువల్ వండర్‌పై మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!