Thu Dec 26 2024 17:44:09 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్‌పై అంబటి విమర్శలు..
విజయవాడలో జరిగిన 'వ్యూహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు.
Pawan Kalyan : విజయవాడలో జరిగిన ఆర్జీవీ 'వ్యూహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏపీ పాలిటిక్స్ ఆధారంగా వ్యూహం, శపథం అనే సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లైఫ్ లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలు తీసుకోని వర్మ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులకు సంబంధించిన పాత్రలు ఒరిజినల్ పేరులతోనే కనిపించబోతున్నాయి. ఈ నెల 29న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక నిన్న విజయవాడలో వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి.. వైసీపీ నాయకులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ ఈవెంట్ లో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. "కొంతమంది శ్యామ్ బాబు అంటూ దొంగ పేర్లతో తమ సినిమాల్లో క్యారెక్టర్స్ పెట్టి సినిమాలు తీస్తుంటారు. అలా దొంగ పేర్లతో కాదు అసలు పేర్లతో వ్యూహం లాంటి సినిమా తీసే దమ్ముండాలి" అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల పవన్ నటించిన 'బ్రో' సినిమాలో నటుడు పృథ్వీ శ్యామ్ బాబు అనే పాత్రలో కనిపించారు. ఆ పాత్ర నిజ జీవితంలో అంబటిని పోలి ఉందని అప్పటిలో పెద్ద రచ్చే జరిగింది.
ఇది ఇలా ఉంటే, ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా 'వ్యూహం' సినిమా తీశారని, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. లోకేశ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వ్యూహం చిత్రం విడుదలపై ఆంక్షలు విధించింది. వ్యూహం చిత్రాన్ని ఓటీటీ, ఆన్ లైన్, ఇంటర్నెట్ వేదికల్లో విడుదల చేయొద్దని సివిల్ కోర్టు ఆదేశించింది.
Next Story