అరవింద్ స్వామి వెనుక ఇంత విషాదమా..?
తమిళ నటుడు అరవింద్ స్వామి అంటే ఇప్పటికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి ‘రోజా’, ‘బొంబాయి’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ తో పాటు తమిళ ఆడియన్స్ ను కూడా కట్టి పడేశాడు. అయితే తమిళంలో స్టార్ హీరోగా ఎదుగుతున్న టైంలో అరవింద్.. ఉన్నట్లుండి తెరమరుగైపోయాడు. ఆలా అవడానికి పెద్ద విషాదం ఉందని అంటున్నాడు అరవింద్. మణిరత్నంతో రోజా సినిమా చేసిన తర్వాత చదువు కోసం అమెరికాకు వెళ్లిన తాను తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో తిరిగి ఇండియాకు రావాల్సి వచ్చిందని అన్నాడు. ఆమె కోసం ఇక్కడే ఆరు నెలలు ఉండాల్సి వచ్చిందని... కానీ తన తల్లిని కాపాడుకోలేకపోయానని.. తర్వాత కొంతకాలానికే తన తండ్రి చనిపోయాడని తెలిపాడు. అప్పుడు ఆ బాధలో నుండి బయటికి రావటానికి మణిరత్నం నాతో సినిమాలు చేయడం స్టార్ట్ చేసాడని చెప్పాడు.
విషాదంతో దూరమైతే జోకులా..?
ఆ సమయంలో సఖి సినిమా చేసానని.. ఆ తర్వాత ఇంక వద్దు అనుకుని తన కుటుంబ వ్యాపారాల్ని టేకప్ చేసానని.. అందులో పడి సినిమాలకి పూర్తిగా దూరమయ్యానని చెప్పాడు అరవింద్. ఆ టైంలో తన భార్యతో విడాకులు కావడం.. పిల్లల బాధ్యత తానే చూసుకోవటం జరిగిందని అన్నాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత తీవ్రమైన వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరానని.. ఆ సమయంలో తనకు పక్షవాతం కూడా వచ్చిందని కూడా చెప్పాడు. ఆ సమయంలో తను 110 కిలోల బరువు పెరిగానని అన్నాడు. కానీ ఈ విషయాలు ఏమి తెలియక కొంతమంది సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి కామెడీ చేస్తున్నారని తన బాధను వ్యక్తం చేసాడు. కడలి సినిమా కోసం ఆ బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు అరవింద్.